"రైల్లో మంటలు".. తప్పుడు ప్రచారంతో నలుగురు బలి.. మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం

Morena train tragedy four passengers run over by Patalkot Express
  • మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం, నలుగురి మృతి
  • రైలులో మంటలంటూ తప్పుడు ప్రచారం చేయడంతోనే ఘటన
  • చైన్ లాగి ఆపిన రైలు నుంచి దిగిన ప్రయాణికులపైకి దూసుకొచ్చిన మరో రైలు
  • మృతుల్లో ఆగ్రాకు చెందిన 35 ఏళ్ల మహిళ, ఆమె నాలుగేళ్ల కుమారుడు
  • ఘటనపై విచారణకు ఆదేశించిన రైల్వే శాఖ
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఘోర రైలు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడితో సహా నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక చిన్న తప్పుడు ప్రచారం ఈ దారుణానికి కారణమైంది. కేవలం ఆందోళనతో ప్రయాణికులు తీసుకున్న నిర్ణయం వారిని మృత్యువు బారిన పడేలా చేసింది. ఈ విషాద ఘటన మొరేనా సమీపంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం సాయంత్రం 4:15 గంటల సమయంలో ఖజురహో నుంచి ఉదయ్‌పూర్ వెళుతున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (19665) హెతమ్‌పూర్-ధోల్‌పూర్ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తోంది. ఇంతలో ఒక జనరల్ కోచ్‌లో ఎవరో అత్యవసర చైన్ లాగడంతో రైలు మధ్యలోనే ఆగింది. అదే సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి "ఫైర్, ఫైర్" (రైలులో మంటలు) అని గట్టిగా అరవడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు చెలరేగాయి.

ఏం జరుగుతుందో తెలియని ఆందోళనతో, చాలా మంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి కిందకు దిగారు. కానీ, దురదృష్టవశాత్తు వారు పక్క ట్రాక్‌పైకి వెళ్లారు. అదే సమయంలో వేగంగా వస్తున్న ఫిరోజ్‌పూర్-సియోని పాతాళ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (20424) వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆగ్రాకు చెందిన అఫ్రీన్ (35), ఆమె నాలుగేళ్ల కుమారుడు, అదే ప్రాంతానికి చెందిన శకుంతల (60), రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన విర్మా దేవి (60) అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది, స్థానిక యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. అనుమతి లేకుండా రైళ్లు ఆగినప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ కిందకు దిగవద్దని రైల్వే అధికారులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Madhya Pradesh Train Accident
Morena Train Tragedy
Patalkot Express
False Fire Rumor
Indian Railways
Khajuraho Udaipur Intercity Express

More Telugu News