అమెరికా దాడిలో వైజాగ్ ఇంజినీర్ మృతిపై నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి

Nara Lokesh deep shock over Vizag engineer death in US attack
  • ఆయిల్ ట్యాంకర్‌ నౌకపై అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్‌ సురేశ్‌ మృతి
  • సురేశ్‌ మృతిపై ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఆవేదన
  • మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి
  • వివాహ వార్షికోత్సవానికి కొద్దిరోజుల ముందు విషాద ఘటన
హర్మూజ్ జలసంధి సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌ నౌకపై జరిగిన దాడిలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్‌ పట్నాల సురేశ్‌ (44) మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త తనను తీవ్ర ఆవేదనకు, షాక్ కు గురిచేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

"హర్మూజ్ జలసంధి సమీపంలో ‘ఎంటీ సెట్టెబెల్లో’ అనే ట్యాంకర్‌పై ఇటీవల జరిగిన దాడిలో విశాఖపట్నానికి చెందిన పట్నాల సురేశ్‌ గారు మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. సముద్రంలో ఏళ్లపాటు అంకితభావంతో పనిచేసిన ఆయన, తన 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ఇంటికి తిరిగి రావడానికి కొద్దిరోజుల ముందే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరం. ఆయన భార్య భార్గవి గారికి, ఇద్దరు చిన్నారులకు, మన విశాఖ సమాజానికి ఇది తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని లోకేశ్‌ తన పోస్టులో పేర్కొన్నారు.

అలాగే, సురేశ్‌ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో కేంద్ర ప్రభుత్వాన్ని, విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆయన కోరారు. ఈ కష్టకాలంలో సురేశ్‌ కుటుంబానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఒమన్ తీరానికి సమీపంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సెట్టెబెల్లో’ అనే చమురు ట్యాంకర్‌పై అమెరికా సైన్యం దాడి చేసింది. అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించేందుకు ఈ నౌక ప్రయత్నించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. సురేశ్‌తో పాటు డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా కూడా మరణించారు. ఈ దుర్ఘటనతో విశాఖలోని సురేశ్‌ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయనకు భార్య, 13, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని వెంటనే స్వస్థలానికి తరలించాలని కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు.


Go Back to Shorts
Patnala Suresh
Nara Lokesh
Vizag engineer death
MT Settebello attack
Strait of Hormuz incident
US military tanker attack

More Telugu News