విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. ఆర్థిక సాయం వివరాలు ప్రకటించిన పవన్ కల్యాణ్
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పవన్ పరిశీలన
- కిమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం
- బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ
- నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు
- త్వరలో కార్మికుల సమస్యలపై సమావేశం నిర్వహిస్తానని వెల్లడి
ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున సాయం అందిస్తామని, వారి పూర్తి చికిత్స ఖర్చులను ఆర్.ఐ.ఎన్.ఎల్. భరిస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం కల్పిస్తామన్నారు. పదవీ విరమణ ప్రయోజనాల కింద రెగ్యులర్ ఉద్యోగులకు రూ. 1.72 కోట్లు, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ. 45.75 లక్షలు అందుతాయని వివరించారు. మృతుల పిల్లల చదువులకు కూడా యాజమాన్యం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
గత 30 ఏళ్లలో ఇలాంటి ఘోర దుర్ఘటన జరగలేదని పవన్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ముందు రోజు రాత్రి కూడా ప్లాంట్‌లో ఇలాంటి చిన్న సాంకేతిక లోపం తలెత్తిందని, అయితే రాత్రి వేళ కార్మికులు ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికీ తెలియలేదని తన దృష్టికి తెచ్చారని ఆయన వివరించారు. ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలు, యంత్రాల ఆధునికీకరణపై దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని, వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలపై, వారి భద్రతపై త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి స్వయంగా కార్మికులతో మాట్లాడతానని పవన్ హామీ ఇచ్చారు. ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం బాధపడి వదిలేయకుండా.. ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు యాజమాన్యం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.