80 కేజీల డెడ్‌లిఫ్ట్‌ ఎత్తడంతో గాయమైంది... ఆ సమయంలో మంచానికే పరిమితమయ్యాను: రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh injured while lifting 80 kg deadlift
  • సేఫ్టీ బెల్ట్ లేకపోవడం వల్ల స్లిప్ డిస్క్ సమస్య వచ్చిందని వెల్లడి
  • గాయం కారణంగా 40 రోజుల పాటు మంచానికే పరిమితమయ్యానని వివరణ
  • డెడ్‌లిఫ్ట్‌ను ఒక ఈగో లిఫ్ట్ అని అభివర్ణించిన నటి
  • కష్టకాలంలో భర్త జాకీ భగ్నానీ అండగా నిలిచాడని వ్యాఖ్య
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తాను గతంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఆరోగ్య సమస్య గురించి తాజాగా స్పందించారు. జిమ్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో 80 కిలోల డెడ్‌లిఫ్ట్‌ను ఎటువంటి సేఫ్టీ బెల్ట్ లేకుండా ప్రయత్నించడం వల్ల స్లిప్ డిస్క్ బారినపడ్డానని, ఆ గాయం కారణంగా సుమారు 40 రోజుల పాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.

నేహా ధూపియా, అంగద్ బేడీలు నిర్వహిస్తున్న 'డబుల్ డేట్' టాక్‌ షోలో తన భర్త జాకీ భగ్నానీతో కలిసి పాల్గొన్న రకుల్, ఆనాటి చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. "మీ ట్రైనర్‌లు ఏం చెప్పినా సరే, డెడ్‌లిఫ్ట్ చేయడం అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యాయామం. అది కేవలం ఒక ఇగో లిఫ్ట్ మాత్రమే. ఆనాడు నేను చేసిన చిన్న పొరపాటు స్లిప్ డిస్క్‌కు దారితీసింది" అని ఆమె పేర్కొన్నారు. ఆ గాయం కారణంగా కనీసం కదలలేని స్థితికి చేరుకున్నానని, నరాల సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయని ఆమె వివరించారు.

ఎంతో చురుకుగా ఉండే తాను, రోజువారీ పనుల కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సి రావడం తనను మానసిక వేదనకు గురిచేసిందని రకుల్ తెలిపారు. "ఇది కేవలం శారీరక గాయమే కాదు, నన్ను మానసికంగానూ ఎంతో కృంగదీసింది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఆ క్లిష్ట పరిస్థితుల్లో తన భర్త జాకీ భగ్నానీ తనకు అండగా నిలిచి ఎంతో ధైర్యాన్ని అందించారని ఆమె పేర్కొన్నారు.

2024 ఫిబ్రవరిలో గోవా వేదికగా వివాహం చేసుకున్న ఈ జంట, తమ వైవాహిక బంధానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఈ షోలో పంచుకున్నారు. 
Go Back to Shorts
Rakul Preet Singh
Jackky Bhagnani
Slip Disc Injury
Deadlift Accident
Gym Injury
Neha Dhupia Talk Show

More Telugu News