కొడుకుకు కీలక మంత్రిత్వ శాఖలు.. డిమాండ్ల జాబితాను రాహుల్ గాంధీకి ఇచ్చిన సిద్ధరామయ్య
- రాజీనామా అనంతరం గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సిద్ధరామయ్య
- కుమారుడు యతీంద్రతో కలిసి ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసిన సిద్ధూ
- రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు అధిష్ఠానానికి థ్యాంక్స్ చెప్పిన సిద్ధరామయ్య
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్ధరామయ్య గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఉదయం తన కుమారుడు యతీంద్రతో కలిసి ఖర్గే, రాహుల్ గాంధీలను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటానని పార్టీ పెద్దలకు చెప్పారు. అనంతరం ఆయన తన డిమాండ్ల జాబితాను వారికి ఇచ్చారు.
సిద్ధరామయ్య రాజ్యసభ, ఎమ్మెల్సీ నియామకాల కోసం కొన్ని పేర్లను అధిష్ఠానానికి సమర్పించినట్లు తెలుస్తోంది. అలాగే మంత్రివర్గంలో కేటాయించే పదవులపై కూడా తన ప్రాధాన్యతలను ఆయన జాబితాలో పొందుపరిచారు. వైద్య, విద్య, వెనుకబడిన తరగతుల శాఖలు లేదా ఇటీవలి వరకు శివకుమార్ నిర్వహించిన పరిశ్రమలు లేదా జలవనరుల శాఖ వంటి కీలక పోర్ట్పోలియోలను తన కుమారుడికి కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది.