సెక్రటేరియట్ వద్ద ధర్నా.. కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కవిత డిమాండ్
- కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించిన పోలీసులు
తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముట్టడికి యత్నించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు ఆ పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే కొనుగోలు చేయాలని, ధాన్యంలో తరుగు పేరిట క్వింటాకు కిలోల కొద్దీ కోత విధిస్తూ రైతులను నిలువునా ముంచేసే విధానాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ కవిత ఆధ్వర్యంలో ఈరోజు సెక్రటేరియట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు.
సచివాలయం ముందు పెద్ద ఎత్తున చేరిన టీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధర్నా చేస్తున్న కవితతో పాటు ఇతర ముఖ్య నాయకులను, మహిళా కార్యకర్తలను పోలీసులు దుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ వాహనాల్లో అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు.