వరంగల్ జంట హత్యల కేసు.. నిందితుడికి మరణశిక్ష
- 2024 జులై 10న జంట హత్యలు
- చెన్నారావుపేట మండలం చింతల తండాలో ఘటన
- హంతకుడు మరణించేంత వరకు ఉరి తీయాలని తీర్పు వెలువరించిన జడ్జి
వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక పాశవిక జంట హత్యల కేసులో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి జె. మైత్రేయి నిందితుడికి మరణశిక్ష విధిస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించారు. 2024 జులై 10 అర్ధరాత్రి వేళ, చెన్నారావుపేట మండలం చింతల తండాలో జంట హత్యల ఘటన చోటుచేసుకుంది. గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేకల నాగరాజు (బన్నీ), తండాకు చెందిన దీపికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే నాగరాజు ప్రవర్తన నచ్చక దీపిక పుట్టింటికి వచ్చేయడంతో, తన భార్యను దూరం చేశారనే పగతో నాగరాజు కక్ష పెంచుకున్నాడు.
అర్ధరాత్రి వేళ కత్తితో దీపిక కుటుంబంపై విచక్షణా రహితంగా దాడి చేయగా.. ఆమె తల్లి సుగుణ అక్కడికక్కడే, తండ్రి శ్రీను ఆసుపత్రి మార్గమధ్యంలో మృతి చెందారు. తీవ్ర గాయాలైన దీపిక, ఆమె సోదరుడు మదన్ ప్రాణాలతో బయటపడ్డారు. నెక్కొండ సీఐ శ్రీనివాస్ పక్కా సాక్ష్యాధారాలతో చార్జిషీట్ దాఖలు చేయగా, బాధితుల తరఫున స్పెషల్ పీపీ బృందాదేవి వాదించారు. నిందితుడి చర్య అత్యంత పాశవికమైనదని, సమాజంలో ఇలాంటి నేరగాళ్లకు జీవించే హక్కు లేదని స్పష్టం చేస్తూ.. నిందితుడు నాగరాజుకు మరణించే వరకు ఉరిశిక్ష అమలు చేయాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు.