బాలయ్య సినిమాలో మంచు మనోజ్.. తన గాడ్ ఫాదర్ అంటూ మనోజ్ భావోద్వేగం
- బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం
- ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటరైన మంచు మనోజ్
- ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఈ సినిమాతో నిజమవుతోందన్న మనోజ్
నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘NBK-111’ నుంచి టాలీవుడ్‌ను ఊపేసే ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు, నటుడు మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను ఈ ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానిస్తూ చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమవడంపై మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో ఎంతో ఆశగా కోరుకున్న అత్యంత ప్రత్యేకమైన బహుమతి ఈ పుట్టినరోజున లభించిందని, తన గాడ్ ఫాదర్, లయన్ నందమూరి బాలకృష్ణతో కలిసి నటించాలనే ఎన్నో ఏళ్ల నిరీక్షణ, కల ఈ సినిమాతో నిజమవుతోందని రాసుకొచ్చారు.
భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేసినా బాలయ్య అన్నతో, గోపీచంద్ మలినేని గారితో ఉన్న అనుబంధం వల్ల ఈ సినిమా తన హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. అలాగే థియేటర్లలో ప్రేక్షకులకు ఒక పెద్ద పండగ లాంటి విందు ఉండబోతోందని, చూసే ప్రతి క్షణం ఈ నిరీక్షణకు తగినట్టుగా ఉంటుందని అభిమానులకు మనోజ్ పక్కా ప్రామిస్ చేశారు.
అయితే, ఈ సినిమాలో మనోజ్ పోషిస్తున్న పాత్రపై చిత్ర బృందం ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నప్పటికీ, ఆయన ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రలో బాలయ్యను ఢీకొట్టబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. గతంలో ‘మిరాయ్’, ‘భైరవం’ వంటి చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో వరుస విజయాలు అందుకున్న మనోజ్... ఇప్పుడు బాలకృష్ణలాంటి అగ్ర హీరో సినిమాలో విలన్‌గా నటిస్తుండటం విశేషం.
గతంలో మనోజ్ నటించిన ‘ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా’ చిత్రంలో బాలయ్య ఒక పవర్‌ఫుల్ రోల్ చేయగా, ఇప్పుడు బాలయ్య సినిమా కోసం మనోజ్ ఏకంగా విలన్‌గా రంగంలోకి దిగడం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను డబుల్ చేసింది.