ట్విషాశర్మ మృతి కేసు: భర్త చేతుల్లో మృతదేహం.. సంచలనం రేపుతున్న సీసీటీవీ ఫుటేజీ

Twisha Sharma Death Case CCTV Footage Surfaces Husband Seen With Body
  • టెర్రస్ పైకి నడుచుకుంటూ వెళ్లిన ట్విషాశర్మ
  • గంట తర్వాత ఆమె మృతదేహాన్ని మోసుకొచ్చిన భర్త
  • పరారీలో ఉన్న భర్త సమర్థ్‌సింగ్ కోసం పోలీసుల వేట
భోపాల్‌లో సంచలనం సృష్టించిన 33 ఏళ్ల ట్విషాశర్మ అనుమానాస్పద మృతి కేసులో అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. ఆమె మరణానికి కొంత సమయం ముందు ఇంటి టెర్రస్‌పైకి నడుచుకుంటూ వెళ్లడం, సరిగ్గా గంట తర్వాత ఆమె భర్త సమర్థ్ సింగ్, మరో ఇద్దరు వ్యక్తులు ఆమె మృతదేహాన్ని మెట్ల మార్గంలో కిందికి తీసుకురావడం వంటి దృశ్యాలు ఈ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అనేక కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ఈ ఫుటేజీ ప్రకారం.. ట్విష మెట్లు ఎక్కి టెర్రస్‌ వైపు వెళ్లడం కనిపించింది. ఆ తర్వాత గంట వ్యవధిలో ఆమె భర్త, ఇతరులు ఆమెను కిందికి మోసుకొచ్చారు. మెట్లపైనే ఆమెకు సీపీఆర్ చేయడానికి ప్రయత్నించినట్టు కూడా దృశ్యాల్లో కనిపిస్తోంది. అయితే, సీసీటీవీలో నమోదైన తేదీ, సమయం తప్పుగా ఉందని, ఈ ఘటన మే 12న జరగ్గా ఫుటేజీలో మే 10 అని చూపిస్తోందని ట్విష కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.

ఏమిటీ కేసు?
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన న్యాయవాది సమర్థ్ సింగ్‌ను ట్విషాశర్మ డిసెంబర్ 2025లో వివాహం చేసుకుంది. మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్‌లో ఉన్న అత్తింటిలో ఆమె ఉరివేసుకుని మరణించినట్లు కనుగొన్నారు. ఇది వరకట్న వేధింపులతో జరిగిన హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించడంతో, ఈ కేసు దర్యాప్తు కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.

పరారీలోనే భర్త.. కొనసాగుతున్న దర్యాప్తు
ఘటన జరిగినప్పటి నుంచి ప్రధాన నిందితుడిగా ఉన్న భర్త సమర్థ్ సింగ్ పరారీలోనే ఉన్నాడు. సోమవారం అతడి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై స్థానిక కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. అతని తల్లి, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్‌కు ఇప్పటికే ముందస్తు బెయిల్ లభించింది.

సమర్థ్ సింగ్‌ను పట్టుకోవడానికి ఆరు బృందాలను ఏర్పాటు చేశామని, అతనిపై రూ.10,000 రివార్డు ప్రకటించామని ఏసీపీ రజనీశ్ కశ్యప్ కౌల్ తెలిపారు. అతడు దేశం విడిచి పారిపోకుండా పాస్‌పోర్ట్ కార్యాలయానికి కూడా సమాచారం అందించినట్లు వివరించారు. ఎయిమ్స్ భోపాల్ ఇచ్చిన ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో "ఉరి వేసుకోవడం వల్లే మరణం" సంభవించినట్లు తేలిందని సిట్ చీఫ్ రజనీశ్ కశ్యప్ పేర్కొన్నారు.

ఒకరిపై ఒకరు ఆరోపణలు
ఈ కేసులో ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. సమర్థ్ సింగ్ బెయిల్ పిటిషన్‌లో ట్విషకు డ్రగ్స్ అలవాటు ఉందని, మానసిక సమస్యలతో బాధపడుతోందని పేర్కొన్నారు. ఆమె గర్భస్రావం తర్వాత అత్తింటివారితో వింతగా ప్రవర్తించేదని, ఆర్ధిక సాయం కూడా ఆన్‌లైన్‌లో పంపిన రికార్డులను కోర్టుకు సమర్పించారు. మరోవైపు, ఈ ఆరోపణలను ట్విష కుటుంబం తీవ్రంగా ఖండించింది. మరణం తర్వాత ఆమె ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ప్రస్తుతం ఒకవైపు సీసీటీవీ ఫుటేజీ, మరోవైపు వాట్సాప్ చాట్స్ వంటి కీలక ఆధారాలతో మధ్యప్రదేశ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న భర్త సమర్థ్ సింగ్ పట్టుబడితే ఈ కేసులోని మిస్టరీ వీడే అవకాశం ఉంది.
Go Back to Shorts
Twisha Sharma
Samarth Singh
Bhopal
dowry harassment
CCTV footage
murder investigation
Madhya Pradesh police
suicide
Katara Hills
crime news

More Telugu News