టీటీడీ ఘనత పట్ల సీఎం చంద్రబాబు స్పందన
- తిరుమలలో 89.40 శాతం అటవీ విస్తీర్ణం సాధించిన టీటీడీ
- టీటీడీ అధికారులను, సిబ్బందిని అభినందించిన సీఎం చంద్రబాబు
- శేషాచలం కొండల్లో అటవీ సంపద పరిరక్షణపై ప్రశంసలు
- ప్రకృతిని కాపాడటం దైవ సేవతో సమానమని వ్యాఖ్య
- భావి తరాలకు పచ్చని తిరుమలను అందించాలని సూచన
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. శేషాచలం కొండల్లో అటవీ సంపదను కాపాడటం, స్థానిక జాతుల మొక్కలను పునరుద్ధరించడం కోసం టీటీడీ చేపట్టిన సుస్థిర పరిరక్షణ చర్యలు అభినందనీయమన్నారు. ఈ కృషి ఫలితంగానే పచ్చదనం గణనీయంగా పెరిగిందని కొనియాడారు.
"మన సంప్రదాయాలు ప్రకృతిని పవిత్రంగా భావిస్తాయి. అడవులు, వన్యప్రాణులను రక్షించడం దైవ సేవతో సమానం. భావి తరాలకు మరింత పచ్చని, ఆరోగ్యకరమైన తిరుమలను అందించడానికి ఈ ప్రయత్నాలు ఎంతగానో దోహదపడతాయి" అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. టీటీడీ కృషి స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణకు టీటీడీ యాజమాన్యం చూపుతున్న చొరవను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.