నిజామాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారు: ధర్మపురి అర్వింద్
- మహేశ్ గౌడ్‌ను అణగదొక్కాలనేది రేవంత్ కుట్ర అన్న అర్వింద్
- అందుకే నిజామాబాద్ జిల్లాను పట్టించుకోవడం లేదని ఆరోపణ
- కోమటిరెడ్డిని సీఎం చేయాలన్న అర్వింద్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాను పూర్తిగా విస్మరించి ప్రజలకు 'పంగనామాలు' పెట్టారని మండిపడ్డారు.
ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను రాజకీయంగా అణగదొక్కాలనే కుట్రతోనే, ఆయన సొంత జిల్లా అయిన నిజామాబాద్‌కు రేవంత్ రెడ్డి మొండిచేయి చూపించారని ఆరోపించారు. జిల్లాకు ఇంత అన్యాయం జరుగుతుంటే మహేష్ కుమార్ గౌడ్ ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ తిరుగుతున్నారంటూ అరవింద్ ఘాటుగా ప్రశ్నించారు. నిజామాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఇస్తామని నాడు హామీ ఇచ్చి, నేడు ఆ ఊసే ఎత్తకుండా ప్రజలను మోసం చేస్తున్నారని, దీనికి ప్రజలే త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
నిజామాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పన, డ్రైనేజీ పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అర్వింద్ విమర్శించారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం రూ. 162 కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం కేవలం రూ. 10 కోట్లు మాత్రమే కేటాయించిందని, కనీసం 25 శాతం పనులు కూడా పూర్తి కాలేదని వివరించారు.
దేవుళ్ళకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా మోసం చేసిన రేవంత్ రెడ్డికి, ప్రజలను మోసం చేయడం ఒక లెక్కా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ హయాంలో ఈ డ్రైనేజీ పనులు ఎప్పటికీ పూర్తికావని ఆయన కుండబద్దలు కొట్టారు. బుల్లెట్ రైల్ కారిడార్, 'ఫ్యూచర్ సిటీ' వ్యవహారాల్లో కూడా ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, గతంలో నగరాన్ని అప్‌గ్రేడ్ చేస్తానన్న కేసీఆర్‌నే నమ్మని ప్రజలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెబుతున్న లేని ఫ్యూచర్ సిటీని అస్సలు నమ్మరని చురకలు అంటించారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు, జాతీయ పరిణామాలపై అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2039 వరకు రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాలేరని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే ప్రకటించారని, దీనర్థం దేశంలో ఇంకో పదేళ్ల పాటు బీజేపీ అధికారంలోనే ఉంటుందని తెలంగాణ సీఎం ఒప్పుకున్నట్లేనని విశ్లేషించారు. రేవంత్ రెడ్డి మోసపూరిత రాజకీయ నాయకుడని... కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నిజాయతీ గల నాయకుడిని తెలంగాణ ముఖ్యమంత్రిగా నియమిస్తే బాగుంటుందని కాంగ్రెస్ అధిష్ఠానానికి అర్వింద్ సూచించారు.