ఇకపై పుట్టపర్తి భక్తికే కాదు.. దేశ భద్రతకు కూడా కేరాఫ్ అడ్రస్: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Puttaparthi Now Center for National Security
  • పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఆమ్కా) ప్రాజెక్టుకు శంకుస్థాపన
  • భక్తి కేంద్రం ఇకపై దేశ భద్రతా కేంద్రంగా మారుతుందన్న సీఎం చంద్రబాబు
  • రికార్డు సమయంలో ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చామని వెల్లడి
  • రాయలసీమను రత్నాలసీమగా మార్చడమే లక్ష్యమని స్పష్టీకరణ
  • రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు, ఉద్యోగ కల్పనే ధ్యేయమన్న ముఖ్యమంత్రి
ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు నెలవైన పుట్టపర్తి గడ్డపై దేశ రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. దేశీయ పరిజ్ఞానంతో ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను తయారుచేసే ప్రతిష్ఠాత్మక అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA - ఆమ్కా) ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్టుతో పుట్టపర్తి ఇకపై భక్తికే కాకుండా దేశ భద్రతకు కూడా కీలక చిరునామాగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.

పుట్టపర్తిలో నూతన అధ్యాయం
పుట్టపర్తి ఇకపై ఆధ్యాత్మిక స్ఫూర్తి నుంచి వ్యూహాత్మక ఆవిష్కరణల కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘ఆంకా’ ప్రాజెక్టు ద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామి అవుతుందని ఆయన తెలిపారు. ప్రాథమికంగా రూ.15,803 కోట్ల వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా తొలిదశలో 7,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.

భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. స్వదేశీ సాంకేతికతతో అత్యాధునిక యుద్ధ విమానాలను తయారు చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

జెట్ స్పీడ్‌తో అనుమతులు
ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసిన వేగాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు నిదర్శనమని అన్నారు. 

"ఈ ఏడాది 9వ తేదీన రక్షణ శాఖలో చర్చలు మొదలైతే, 20న ప్రతిపాదనలు అడిగారు. 24న మేం పంపాం, 28న కేంద్రం అంగీకరించింది. 29న అధికారులు స్థలాన్ని పరిశీలించి, 30న రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. జెట్ స్పీడ్‌తో ఫైటర్ జెట్ ప్రాజెక్టును సాధించాం" అని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టు మంజూరులో కీలక పాత్ర పోషించిన ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీకి రక్షణ కవచం
‘ఆమ్కా' ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఇతర రక్షణ, అనుబంధ పరిశ్రమల గురించి కూడా సీఎం ప్రస్తావించారు. మడకశిరలో భారత్ ఫోర్జ్, హెచ్‌ఎఫ్‌సీఎల్, దోనకొండలో బీడీఎల్ సంస్థలు రూ.2,959 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయని, దీనివల్ల 4-5 వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీ ద్వారా దేశంలోనే ఆధునిక డ్రోన్ ఎకోసిస్టమ్‌కు శ్రీకారం చుట్టామని, రూ.686 కోట్ల పెట్టుబడులతో 8 సంస్థలు వస్తున్నాయని, తద్వారా 2,500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. 

శ్రీహరికోట నుంచి అంతరిక్ష శక్తి, నాగాయలంక నుంచి క్షిపణి శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తి, ఇప్పుడు పుట్టపర్తి నుంచి వైమానిక శక్తితో ఆంధ్రప్రదేశ్ దేశానికి రక్షణ కవచంగా నిలుస్తోందని చంద్రబాబు అన్నారు.

రత్నాల సీమగా రాయలసీమ
గతంలో కరవు సీమగా, రాళ్ల సీమగా పిలవబడిన రాయలసీమ రూపురేఖలు మారుస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. "ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీధుల్లో రత్నాలు రాశులుగా పోసి అమ్మిన ఈ గడ్డను మళ్లీ రత్నాల సీమగా మార్చే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంది" అని ఆయన అన్నారు. 

పెనుకొండలో కియా పరిశ్రమ విజయాన్ని ఉదాహరణగా చూపుతూ, కరువు సీమలో తయారైన కార్లు నేడు 80 దేశాల్లో తిరుగుతున్నాయని గుర్తుచేశారు. కడప స్టీల్ ప్లాంట్‌ను 2028 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్ (JGF) ద్వారా త్వరలో బంగారం ఉత్పత్తి ప్రారంభమవుతుందని, రాయలసీమకు రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి పరిశ్రమలను కూడా తీసుకువస్తామని చెప్పారు.

నీటిపారుదల, పరిశ్రమలతో దశ మార్పు
రాయలసీమ అభివృద్ధికి నీటిపారుదల ప్రాజెక్టులే పునాది అని చంద్రబాబు పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన హంద్రీనీవా, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. గొల్లపల్లి రిజర్వాయర్ వల్లే కియా మోటార్స్ రాగలిగిందని గుర్తుచేశారు. 

సమర్థవంతమైన నీటి నిర్వహణతో నేడు మే నెలలో కూడా పుట్టపర్తి చెరువు నిండుగా ఉందని, ఇది సుపరిపాలనకు నిదర్శనమని అన్నారు. ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ స్టీల్, సిమెంట్ పరిశ్రమలను, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించి సీమ దశ మారుస్తామని భరోసా ఇచ్చారు.

రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం
గత ఐదేళ్ల విధ్వంసకర పాలనతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలను తరిమేసి, క్రిమినల్ రాజకీయాలు చేశారని విమర్శించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి రాష్ట్ర పునర్నిర్మాణానికి హామీ ఇచ్చామని గుర్తుచేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో రాష్ట్రానికి మళ్లీ బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తామని చెప్పారు. 

తమ ప్రభుత్వం 23 నెలల్లోనే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని, వీటి ద్వారా 24 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ప్రకటించారు. రాష్ట్ర యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే అవకాశాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

పొదుపు ఉద్యమానికి పిలుపు
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల (ఇరాన్-అమెరికా యుద్ధం) నేపథ్యంలో దేశ ఆర్థిక భద్రత కూడా ముఖ్యమని చంద్రబాబు అన్నారు. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన ఏడు సూత్రాల పొదుపు మంత్రాన్ని పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

వర్క్ ఫ్రమ్ హోమ్, బంగారం కొనుగోళ్ల తగ్గింపు, ప్రజా రవాణా వినియోగం, వంట నూనెల వాడకం తగ్గింపు, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహం వంటివి పాటించి దేశానికి అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వం కూడా కాన్వాయ్‌లను తగ్గించడం వంటి చర్యలు చేపట్టిందని, ఈ పొదుపు ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Puttaparthi
AMCA Project
Advanced Medium Combat Aircraft
Rajnath Singh
Defense Industry Andhra Pradesh
Make in India
Defense Sector Jobs
Rayalaseema Development
AP Defense Corridor

More Telugu News