బండి సంజయ్, కిషన్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచారు: మహేష్ కుమార్ గౌడ్
- ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మహేష్ గౌడ్
- గత ఎన్నికల్లో పారదర్శకత లోపించిందని ఆరోపణ
- బెంగాల్ ఎన్నికలే దీనికి నిదర్శనమని వ్యాఖ్య
తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR)పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడో దశ ఎస్ఐఆర్ నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో, శుక్రవారం కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (CEO) సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ... గత ఎన్నికల్లో పారదర్శకత లోపించిందని, బెంగాల్ ఎన్నికలే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి 'దొంగ ఓట్ల' సహాయంతోనే గెలిచారని ఘాటుగా ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు లేనందున, ఈ సవరణ ప్రక్రియను తొందరపాటుతో కాకుండా ఏడాది పొడవునా పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
వినతిపత్రంలోని ప్రధాన సూచనలు:
గత 25 ఏళ్లలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగినందున, ఈ ప్రక్రియను ఒకటిన్నర సంవత్సరం నుంచి నుంచి 2 ఏళ్ల పాటు దశలవారీగా చేపట్టాలి. బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO) జియో-ట్యాగ్ ఫొటోలతో కనీసం మూడుసార్లు గృహ సందర్శన చేసి భౌతిక ధృవీకరణ చేయాలి.
ఓటును తొలగించే ముందు ఏడు రోజుల ముందస్తు రాతపూర్వక నోటీసు తప్పనిసరిగా ఇవ్వాలి. అభ్యంతరాల స్వీకరణకు కనీసం నెల రోజులు గడువు ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
రాజకీయ పార్టీలకు 2002 మరియు 2025 నాటి ఓటర్ల జాబితాల సాఫ్ట్ మరియు హార్డ్ కాపీలను అందించాలి. అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ (ASD) జాబితాలను సకాలంలో పార్టీలకు అందజేయాలి.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లు తొలగిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. 2002 తర్వాత రాష్ట్రానికి వలస వచ్చి, కనీసం రెండుసార్లు ఓటు వేసిన వారికి అఫిడవిట్ ప్రాతిపదికన ఓటు హక్కు కల్పించాలి.
జనాభా గణన, ఎస్ఐఆర్ విధులను వేర్వేరు అధికారులు నిర్వహించాలి. ఒకే అధికారికి రెండు బాధ్యతలు అప్పగించకూడదని కాంగ్రెస్ నేతలు కోరారు.