భారత్ వద్ద ఇప్పటివరకు లేని స్టెల్త్ యుద్ధ విమానం... తొలిసారిగా ఏపీలోనే తయారు... దేశానికే తలమానికం!

Chandrababu Naidu Inaugurates Stealth Fighter Jet Project in AP
  • పుట్టపర్తిలో దేశంలోనే తొలి 5వ తరం స్టెల్త్ ఫైటర్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రేపు శంకుస్థాపన
  • రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్న వైనం
  • రూ.15,803 కోట్ల పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టులో యుద్ధ విమానాల తయారీ, టెస్టింగ్
  • దీంతో పాటు మరో 12 డిఫెన్స్, డ్రోన్ ప్రాజెక్టులకు కూడా భూమిపూజ 
  • ఈ ప్రాజెక్టులతో రాయలసీమ ఇక రక్షణ, సాంకేతిక హబ్‌
రాయలసీమ రతనాల సీమ... ఇది చరిత్ర. ఉద్యాన సీమ... ఇది వర్తమానం. ఇకపై దేశ ‘రక్షణ సీమ’... ఇది భవిష్యత్. ఇరిగేషన్, హార్టికల్చర్, స్పేస్, సోలార్ వంటి రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన రాయలసీమ, ఇప్పుడు దేశ రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. దేశ భద్రతకు కీలకమైన అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు పుట్టపర్తి వేదిక కానుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శుక్రవారం, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), డీఆర్‌డీఓ (DRDO) సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) డిఫెన్స్ ప్రాజెక్టుకు భూమి పూజ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కీలక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొంటారు.

దేశంలోనే తొలి 5వ తరం యుద్ధ విమానాల తయారీ కేంద్రం

భారత రక్షణ రంగంలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవనుంది. ఎందుకంటే, ఇది భారతదేశపు మొట్టమొదటి 5వ తరం స్టెల్త్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్ట్. శత్రువుల రాడార్లకు చిక్కకుండా లక్ష్యాలను ఛేదించే స్టెల్త్ టెక్నాలజీ, శబ్ద వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించే ట్విన్ ఇంజిన్ సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, అత్యాధునిక ఏవియానిక్స్, సెన్సార్లు వంటి ఎన్నో ప్రత్యేకతలతో ఈ యుద్ధ విమానాలను ఇక్కడ అభివృద్ధి చేస్తారు. 

భారత్ కు ఇంతవరకు స్టెల్త్ యుద్ధ విమానం లేదు. అది ఇప్పుడు ఏపీలో తయారుకానుండడం దేశ రక్షణ రంగ చరిత్రకే తలమానికం వంటి ఘట్టం. అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, ఈ యుద్ధ విమానాలను పుట్టపర్తిలోనే అభివృద్ధి చేసి, ఇక్కడే టెస్టింగ్ కూడా చేపట్టేలా ప్రాజెక్టును సమగ్రంగా రూపొందించారు. రూ.15,803 కోట్ల భారీ పెట్టుబడితో, 650 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఏఎంసీఏ స్టెల్త్ యుద్ధ విమానం సిద్ధమైతే భారత్... అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాల సరసన సగర్వంగా నిలుస్తుంది.

సీమ యువతకు ఉపాధి... భారీగా అనుబంధ పరిశ్రమలు

ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 7,500 మందికి నాణ్యమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. అంతేకాకుండా, ఈ ప్రధాన ప్రాజెక్టుకు అనుబంధంగా వచ్చే ఏరోస్పేస్, డిఫెన్స్ సంబంధిత ఇతర యూనిట్ల ద్వారా దాదాపు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అనుబంధ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా మరో 400 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. దీనికి సమాంతరంగా కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న 'డ్రోన్ సిటీ' ద్వారా భారతదేశంలోనే అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టమ్‌ను సిద్ధం చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది.

మరో 12 ప్రాజెక్టులకు శ్రీకారం

ఏఎంసీఏ ప్రాజెక్టుతో పాటు రక్షణ, డ్రోన్ రంగాలకు చెందిన మరో 12 కీలక ప్రాజెక్టులకు కూడా శుక్రవారం శంకుస్థాపన జరగనుంది. వీటిలో 4 డిఫెన్స్ ప్రాజెక్టులు, 8 డ్రోన్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 12 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి రూ.4,145 కోట్ల పెట్టుబడులు, 6,071 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. మడకశిరలో రెండు, దొనకొండ, నెల్లూరుల్లో ఒక్కో డిఫెన్స్ ప్రాజెక్టు ఏర్పాటు కానుండగా, మిగిలిన 8 డ్రోన్ ప్రాజెక్టులు కర్నూలు డ్రోన్ సిటీలో కొలువుదీరనున్నాయి.

శంకుస్థాపన చేస్తున్న డిఫెన్స్ ప్రాజెక్టులు
కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ – రూ. 1430 కోట్ల పెట్టుబడి – 565 మందికి ఉపాధి
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ – రూ. 489 కోట్ల పెట్టుబడి – 500 మందికి ఉపాధి
HFCL – రూ. 1040 కోట్ల పెట్టుబడి – 870 మందికి ఉపాధి
ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ – రూ. 500 కోట్ల పెట్టుబడి – 2050 మందికి ఉపాధి

కర్నూలు డ్రోన్ సిటీలో రానున్న ప్రాజెక్టులు
అల్గోబాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ. 34 కోట్ల పెట్టుబడి – 52 మందికి ఉపాధి
డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ. 255 కోట్ల పెట్టుబడి – 850 మందికి ఉపాధి
డ్రోన్ ల్యాబ్ టెక్నాలజీస్ – రూ. 5 కోట్ల పెట్టుబడి – 14 మందికి ఉపాధి
హెచ్ సి రోబోటిక్స్ – రూ. 100 కోట్ల పెట్టుబడి – 500 మందికి ఉపాధి
సెన్స్ ఇమేజ్ టెక్నాలజీస్ – రూ. 68 కోట్ల పెట్టుబడి – 45 మందికి ఉపాధి
ఎయిర్ పేస్ ఇండస్ట్రీస్ – రూ. 100 కోట్ల పెట్టుబడి – 150 మందికి ఉపాధి
జేడీకే ఫ్లై డ్రోన్ వరల్డ్ – రూ. 114 కోట్ల పెట్టుబడి – 350 మందికి ఉపాధి
లాట్రిక్ ఎయిరో స్పేస్ – రూ. 10 కోట్ల పెట్టుబడి – 125 మందికి ఉపాధి

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం 08:15 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఉదయం 09:45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10:15 గంటలకు శంకుస్థాపన కార్యక్రమ వేదిక వద్దకు వస్తారు. ఉదయం 10:15 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఏఎంసీఏ ప్రాజెక్టుతో పాటు ఇతర డిఫెన్స్, డ్రోన్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి భూమి పూజ చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 02:20 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.
Go Back to Shorts
Chandrababu Naidu
AMCA Project
Puttaparthi
Stealth Fighter Jet
Defense Projects AP
DRDO
Aeronautical Development Agency
Rayalaseema
Drone City
Raj Nath Singh

More Telugu News