'మేడ్ ఇన్ ఆంధ్ర - మేడ్ ఫర్ ఇండియా - మేడ్ ఫర్ ది వరల్డ్'.. ఇదే మా ధ్యేయం: నారా లోకేష్

Nara Lokesh Focuses on MSMEs for Job Creation in Andhra Pradesh
  • రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఎంఎస్ఎంఈలదే కీలక పాత్ర
  • 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు
  • వచ్చే మూడు నెలల్లో 100 ఏపీ కంపెనీలు ఎన్ఎస్ఈలో లిస్ట్ కావాలని లక్ష్యం
  • 'ఒకే రాజధాని-అభివృద్ధి వికేంద్రీకరణ' నినాదంతో 22 క్లస్టర్ల ఏర్పాటు
  • 'మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్' ప్రభుత్వ ధ్యేయం
ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ బృహత్కార్యంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పాత్ర అత్యంత కీలకమని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. “మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్” అనే నినాదాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE), ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సీఐఐ సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన ఎస్ఎంఈ ఐపీఓపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

యువగళం యాత్రే స్ఫూర్తి

తన యువగళం పాదయాత్రే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి స్ఫూర్తినిచ్చిందని లోకేష్ వివరించారు. “3132 కిలోమీటర్ల పాదయాత్రలో ఎందరో ప్రజల కష్టసుఖాలు చూశాను. పెనుగొండలో కియా అనుబంధ సంస్థలో పనిచేస్తున్న పద్మావతి అనే సోదరి తన అనుభవాన్ని పంచుకుంది. కియా రాకముందు గృహిణిగా ఉన్న ఆమె, పరిశ్రమ వచ్చాక ఉద్యోగంలో చేరి నెలకు రూ.30 వేలు సంపాదిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. ఆమె కథ విన్నాక ఉద్యోగ కల్పన ప్రాధాన్యం నాకు మరింత అర్థమైంది. ఆ ఆలోచన నుంచే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం పుట్టింది” అని లోకేష్ పేర్కొన్నారు.

పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్

గడిచిన 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని మంత్రి తెలిపారు. “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఇప్పటివరకు 800 ప్రాజెక్టుల ద్వారా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు కుదిరాయి. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు రూ.1.35 లక్షల కోట్ల చొప్పున పెట్టుబడులతో ముందుకొచ్చాయి. వాటికి శంకుస్థాపనలు కూడా జరిగాయి. రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలతో పాటు పుట్టపర్తిలో ఫైటర్ జెట్ తయారీ కేంద్రం ‘AMCA’ ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి రాబోతోంది” అని వెల్లడించారు.

ఒక పెద్ద పెట్టుబడి వస్తే దాని చుట్టూ అనేక అనుబంధ పరిశ్రమలు ఎలా వస్తాయో వివరిస్తూ ‘మల్టిప్లయర్ ఎఫెక్ట్’ గురించి లోకేష్ మాట్లాడారు. “విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కారణంగా, దానికి అవసరమైన కూలింగ్ సిస్టమ్స్ సరఫరా కోసం క్యారియర్ కంపెనీ శ్రీసిటీలో యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఇదే మల్టిప్లయర్ ఎఫెక్ట్,” అని ఆయన వివరించారు.

అభివృద్ధి వికేంద్రీకరణే ప్రభుత్వ లక్ష్యం

‘ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ’ అనేదే ప్రభుత్వ విధానమని లోకేష్ స్పష్టం చేశారు. “రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ఉన్నాం. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం. రాయలసీమలో ఆటోమొబైల్, కోస్తాలో ఆక్వా, ఉత్తరాంధ్రలో ఫార్మా, డేటా సెంటర్లు వంటి రంగాలపై దృష్టి సారించాం. నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయబోతున్నాం,” అని తెలిపారు.

ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ అండ

“మాకు గూగుల్ ఎంత ముఖ్యమో, రూ.50 లక్షల పెట్టుబడితో మొదలయ్యే చిన్న పరిశ్రమ కూడా అంతే ముఖ్యం. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వైపు పయనిస్తున్నాం. పారిశ్రామికవేత్తలకు ఏ కష్టం వచ్చినా తాను ఒక మెసేజ్ దూరంలో ఉంటానని” భరోసా ఇచ్చారు.
రాబోయే మూడు నెలల్లో కనీసం 100 ఎంఎస్ఎంఈ కంపెనీలు ఎన్ఎస్ఈలో లిస్ట్ అయ్యేలా ఎంఎస్ఎంఈ శాఖ కృషి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు లోకేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, కేశినేని శివనాథ్, ఎన్ఎస్ఈ సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Andhra Pradesh
MSME
Jobs
Investments
Chandrababu Naidu
NSE
Startup
AP MSME Development Corporation
Industrial Clusters

More Telugu News