ఆయనకు న్యాయం చేయండి... ఇంకా బంగ్లాదేశ్ జైల్లోనే మగ్గుతున్నారు: పవన్ కల్యాణ్

Pawan Kalyan Demands Justice for ISKCON Monk Chinmoy Krishna Das
  • బంగ్లాదేశ్‌లో జైలులో ఉన్న ఇస్కాన్ సన్యాసిని విడుదల చేయాలన్న పవన్
  • 500 రోజులుగా నిర్బంధంలో ఉన్నా బెయిల్ నిరాకరించడంపై ఆగ్రహం
  • మైనారిటీ హిందువుల హక్కుల కోసం మాట్లాడటం నేరమా అని ప్రశ్న
  • సెలెక్టివ్ మానవ హక్కుల కార్యకర్తల మౌనాన్ని తప్పుబట్టిన పవన్
బంగ్లాదేశ్‌లో 500 రోజులకు పైగా జైలులో ఉన్న ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభుకు తక్షణమే న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఆయనకు వైద్య సహాయం అందించడంతో పాటు, వెంటనే బెయిల్ మంజూరు చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొందరు మానవ హక్కుల కార్యకర్తలు ప్రదర్శిస్తున్న మౌనాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

ఈ అంశంపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. "500 రోజులకు పైగా జైలు, పదేపదే బెయిల్ నిరాకరణ. ఆయన తరఫు న్యాయవాదులను కూడా కోర్టు హాలులో బెదిరిస్తుంటే ఇక న్యాయం ఎలా జరుగుతుంది? మైనారిటీ హిందూ సమాజం హక్కుల కోసం పోరాడటం నేరమా?" అని ప్రశ్నించారు. కాషాయ వస్త్రాలు ధరించిన ఒక ఆధ్యాత్మిక గురువును నేరస్థుడిలా చూస్తూ, ఆయన గొంతు నొక్కుతుంటే ప్రపంచం మౌనంగా ఉండకూడదని పవన్ కల్యాణ్ అన్నారు.

"కొన్ని అంశాలపై హ్యాష్‌ట్యాగ్‌లతో రాత్రికి రాత్రే స్పందించే నకిలీ సెక్యులరిస్టులు, సెలెక్టివ్ మానవ హక్కుల కార్యకర్తలు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? వారి మానవత్వానికి కూడా ఫిల్టర్ ఉందా?" అని పవన్ విమర్శించారు. చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభుకు వెంటనే న్యాయపరమైన సహాయం, వైద్యం అందించి, బెయిల్‌పై విడుదల చేయాలని ఆయన కోరారు.
Go Back to Shorts
Pawan Kalyan
Chinmoy Krishna Das
ISKCON Monk
Bangladesh Jail
Human Rights
Justice for Chinmoy
Hindu Rights
False Secularists
Andhra Pradesh Deputy CM
Bail Denial

More Telugu News