వరంగల్‌లో పురాతన ఆలయం కూల్చివేత వివాదం.. కలెక్టరేట్ కీల‌క‌ ప్రకటన

Warangal Temple Demolition Controversy Collector Clarification
  • వరంగల్ జిల్లాలో పురాత‌న‌ ఆలయం కూల్చివేశారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టీక‌ర‌ణ‌
  • పాఠశాల నిర్మాణ పనుల్లో పాత శిథిల కట్టడం బయటపడిందని, కూల్చివేత జరగలేదని వెల్లడి
  • కలెక్టర్, ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి కట్టడాన్ని పునరుద్ధరిస్తామని హామీ
  • పురావస్తు శాఖతో సంప్రదించి కట్టడానికి గుర్తింపు తెస్తామని ప్రకటన
  • ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో వెలువడిన అధికారిక వివరణ
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం కోసం పురాతన ఆలయాన్ని కూల్చివేశారని వస్తున్న వార్తలను జిల్లా అధికారులు ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయని శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ వివాదంపై స్పందించిన జిల్లా యంత్రాంగం, శిథిలావస్థలో ఉన్న కట్టడాన్ని పరిరక్షించి, పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే... ఖానాపూర్ మండలం పహాడ్ల అశోక్‌నగర్ గ్రామంలో ఈ నెల 6న ఆలయాన్ని కూల్చివేశారని కొన్ని మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. దీనిపై వరంగల్ కలెక్టర్ కార్యాలయం స్పందిస్తూ ఓ వివరణ జారీ చేసింది. 6న నర్సంపేట రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, పురావస్తు శాఖ అధికారులు, ఖానాపూర్ తహసీల్దార్, తెలంగాణ విద్యా, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఈడ‌బ్ల్యూఐడీసీ) ప్రతినిధులతో కలిసి సంయుక్తంగా తనిఖీ చేసినట్లు తెలిపారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ కోసం కేటాయించిన 30 ఎకరాల భూమిలో దట్టమైన పొదలు, చెట్లు ఉన్నాయని, వాటిని తొలగించి చదును చేస్తుండగా ఒక పాత శిథిల కట్టడం అవశేషాలు బయటపడ్డాయని అధికారులు పేర్కొన్నారు. నిర్మాణ ఏజెన్సీ ఎలాంటి కూల్చివేతలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ భూమి అని, దేవాదాయ శాఖకు చెందింది కాదని తేలింది. ఈ భూమిని గిరిజన సంక్షేమ శాఖకు ఇప్పటికే కేటాయించినట్లు తెలిపారు.

పురావస్తు శాఖ అధికారుల ప్రకారం, ఈ కట్టడం వారి రికార్డులలో రక్షిత స్మారక చిహ్నంగా గానీ, పురావస్తు ప్రదేశంగా గానీ నమోదు కాలేదని వెల్లడైంది. చాలా కాలంగా ఈ కట్టడం శిథిలావస్థలోనే ఉందని, వాడుకలో లేదని సంయుక్త తనిఖీ బృందం గుర్తించింది.

ఈ నేపథ్యంలో నిన్న‌ వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, నర్సంపేట ఎమ్మెల్యే డి. మాధవరెడ్డితో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. చరిత్రకారులు, స్థపతులు, పురావస్తు శాఖ నిపుణులతో సంప్రదించి అదే ప్రదేశంలో ఈ కట్టడాన్ని పునరుద్ధరిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కట్టడాన్ని పురావస్తు శాఖలో నమోదు చేయడానికి అవసరమైన చర్యలు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు ఈ కట్టడం కూల్చివేతపై ఆరోపణలు చేసి, తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన కొన్ని గంటల్లోనే అధికారులు ఈ వివరణ ఇవ్వడం గమనార్హం.
Go Back to Shorts
Warangal Temple demolition
Warangal
Telangana
Ancient temple
TRS
BRS
BJP
Satya Sarada
D Madhava Reddy
Archaeological site

More Telugu News