సినిమా టికెట్ రేట్ల పెంపుపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు
- పెద్ద సినిమాల టికెట్ రేట్లను పెంచడాన్ని తప్పుబట్టిన రవిబాబు
- హీరోలను, సినిమాలను భుజాన మోసేది అభిమానులే అని వ్యాఖ్య
- తొలి రోజు అభిమానులకు సినిమాను ఫ్రీగా చూపించాలన్న రవిబాబు
సినిమా విడుదల సమయంలో టికెట్ల ధరల పెంపుపై టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్, నటుడు రవిబాబు తనదైన శైలిలో స్పందించారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రేజర్' చిత్రం మే 8న విడుదలకు సిద్ధమవుతున్న వేళ, సినిమా టికెట్ల ధరల పెంపుపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం... పెద్ద సినిమా వస్తోందంటే చాలు టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనిపై రవిబాబు స్పందిస్తూ, "హీరోలను, సినిమాలను భుజాన వేసుకుని మోసేది అభిమానులే. అలాంటి వారి దగ్గర మొదటి రోజే ఎక్కువ డబ్బులు వసూలు చేయడం చాలా తప్పు" అని పేర్కొన్నారు.
సినిమా విడుదలైన మొదటి రోజు అభిమానులకు సినిమాను ఉచితంగా చూపించాలని ఆయన అభిప్రాయపడ్డారు. టికెట్ ధరల పెంపు వల్ల సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి భయపడుతున్నారని, ఈ పద్ధతి మారాలని ఆయన సూచించారు.