మీ నాయకత్వం దేశానికే ఆదర్శం.. చంద్రబాబుకు బాలకృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు

Balakrishna birthday special wishes To Nara Chandrababu Naidu
  • ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ
  • దూరదృష్టి, దృఢ సంకల్పమే చంద్రబాబు నాయకత్వానికి ప్రతీక అని వ్యాఖ్య
  • రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కృషి అందరికీ ప్రేరణగా నిలుస్తుందన్న బాలయ్య
  • ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, ఆయ‌న వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

చంద్రబాబు నాయకత్వ పటిమను బాలకృష్ణ ప్రత్యేకంగా ప్రశంసించారు. "దూరదృష్టి, దృఢ సంకల్పం, అభివృద్ధి పట్ల అంకితభావం.. ఇవే మీ నాయకత్వానికి ప్రతీక. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మీరు చేస్తున్న నిరంతర కృషి ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తోంది" అని తన పోస్టులో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబు విజన్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని బాలకృష్ణ కొనియాడారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ఆయన మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని బాలకృష్ణ ఆకాంక్షించారు.
Advertisement
Balakrishna
Chandrababu Naidu
Birthday Wishes
Andhra Pradesh

More Telugu News