జీవన్ రెడ్డి ఇంటి వద్ద తోపులాట.. జర్నలిస్టులకు గాయాలు
జగిత్యాలలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీశాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం వద్ద జరిగిన తోపులాటలో మీడియా ప్రతినిధులు గాయపడటం, వారి పరికరాలు ధ్వంసం కావడం తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే... కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులతో కలిసి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు ఒక్కసారిగా లోపలికి దూసుకురావడంతో అక్కడ తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
అదుపుతప్పిన కార్యకర్తలు అక్కడ విధుల్లో ఉన్న మీడియా ప్రతినిధులపై పడిపోవడంతో పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. తోపులాటలో ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఖరీదైన వీడియో కెమెరాలు కిందపడి ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మీడియా ప్రతినిధులు, ఆ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసి నిరసన తెలిపారు.