AP High Court: భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు హక్కు ఉండదు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు!

AP High Court Husband has no right on wifes inherited property
షార్ట్స్‌లో చూడండి
వారసత్వ ఆస్తి విషయంలో తలెత్తిన ఒక వివాదంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సంతానం లేకుండా మరణించిన హిందూ వివాహిత మహిళకు ఆమె తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిపై భర్తకు ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది. ఆ ఆస్తి తిరిగి ఆమె తండ్రి తరఫు చట్టబద్ధ వారసులకే (లీగల్ హెయిర్స్) చెందుతుందని తేల్చిచెప్పింది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15(2)(ఏ) ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతోందని న్యాయస్థానం పేర్కొంది. అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ ఆస్తి వివాదంలో ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ ఇచ్చిన పరస్పర విరుద్ధమైన ఆదేశాలను పరిష్కరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఇటీవల ఈ తీర్పు ఇచ్చారు.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన చిక్కాల వెంకాయమ్మకు 1.50 ఎకరాల భూమి ఉంది. ఆమె తన మొదటి మనవరాలు శ్రీవిరితకు ఆ భూమిని 2002లో గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చారు. శ్రీవిరిత పేరు రెవెన్యూ రికార్డుల్లో కూడా నమోదైంది. అయితే, శ్రీవిరిత 2005లో సంతానం లేకుండా అకాల మరణం చెందారు. దీంతో నాయనమ్మ వెంకాయమ్మ 2007లో ఆ గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి, 2011లో అదే భూమిని తన రెండో మనవరాలైన దేవిక మానసకు గిఫ్ట్‌గా రాశారు.

ఈ క్రమంలో, రికార్డుల్లో దేవిక పేరు చేర్చాలని నర్సీపట్నం ఆర్డీవో 2017లో ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ శ్రీవిరిత భర్త శ్రీరామదొర, అనకాపల్లి జాయింట్ కలెక్టర్ (జేసీ) వద్ద రివ్యూ పిటిషన్ వేశారు. విచారించిన జేసీ, ఒకసారి ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయలేరని, శ్రీరామదొరకు అనుకూలంగా 2023లో ఉత్తర్వులిచ్చారు. జేసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ దేవిక మానస హైకోర్టును ఆశ్రయించారు.

వాదనలు విన్న న్యాయస్థానం, హిందూ వారసత్వ చట్టం ప్రకారం శ్రీవిరితకు తల్లిదండ్రుల వైపు నుంచి సంక్రమించిన ఆస్తిపై ఆమె భర్త శ్రీరామదొరకు హక్కు ఉండదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, గిఫ్ట్ డీడ్ రద్దును సవాలు చేసే హక్కు శ్రీవిరితకు మాత్రమే ఉంటుందని, ఆమె భర్తకు ఆ హక్కు లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో జేసీ ఉత్తర్వులను రద్దు చేస్తూ, దేవిక మానస పేరును రెవెన్యూ రికార్డుల్లో చేర్చాలని పాయకరావుపేట తహసీల్దార్‌ను హైకోర్టు ఆదేశించింది.
Go Back to Shorts
AP High Court
Hindu Succession Act
property rights
inheritance law
Andhra Pradesh
legal heirs
Sriram Dora
Devika Manasa
Anakapalli district

More Telugu News