Rohit Sharma: రోహిత్, రికెల్టన్ ఫైర్... భారీ స్కోర్ల మ్యాచ్ లో ముంబై విన్నర్

Rohit Sharma Rickelton Fire Mumbai Indians Winner in High Scoring Match
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగులు వెల్లువెత్తిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో, ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై బ్యాటర్లు మరో 5 బంతులు మిగిలి ఉండగానే, కేవలం 4 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (78), ర్యాన్ రికెల్టన్ (81) సృష్టించిన విధ్వంసం ముందు కేకేఆర్ బౌలర్లు తేలిపోయారు.

221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదడంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ఈ జోడీ కేవలం 11.5 ఓవర్లలోనే మొదటి వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను పూర్తిగా ముంబై వైపు తిప్పేసింది. 

రోహిత్ 38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేయగా, రికెల్టన్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరూ అవుటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్ (16), తిలక్ వర్మ (20) కూడా వేగంగా ఆడారు. చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (18 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు.

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా అద్భుతంగా రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (17 బంతుల్లో 37) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, కెప్టెన్ అజింక్య రహానే (40 బంతుల్లో 67) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. యువ ఆటగాడు అంగక్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 51) కూడా అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 

చివర్లో రింకూ సింగ్ (21 బంతుల్లో 33 నాటౌట్) వేగంగా పరుగులు చేయడంతో కేకేఆర్ భారీ స్కోరును నమోదు చేసింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లతో రాణించాడు. అయితే, బ్యాటర్ల హవా నడిచిన ఈ మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ల భాగస్వామ్యమే ఫలితాన్ని నిర్దేశించింది.


Go Back to Shorts
Rohit Sharma
Mumbai Indians
KKR
Ryan Rickelton
IPL 2026
Kolkata Knight Riders
Wankhede Stadium
Hardik Pandya
Rinku Singh
Ajinkya Rahane

More Telugu News