Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద 'ధురంధ‌ర్ 2' వసూళ్ల సునామీ... రికార్డులను తిరగరాస్తున్న రణ్‌వీర్

Ranveer Singhs Dhurandhar 2 Box Office Collection Records
షార్ట్స్‌లో చూడండి
భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న 'ధురంధ‌ర్ 2: ది రివెంజ్' చిత్రం, తన జోరును రెండో రోజు కూడా కొనసాగించింది. మొదటి రోజుతో పోలిస్తే కలెక్షన్లలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, శుక్రవారం కూడా భారీ వసూళ్లను నమోదు చేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, రెండో రోజు దేశవ్యాప్తంగా రూ. 80.72 కోట్ల నెట్ వసూలు చేసింది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ. 226.27 కోట్లకు చేరాయి.

విడుదలైన రెండో రోజైన శుక్రవారం, దేశవ్యాప్తంగా 20,125 షోల ద్వారా ఈ మొత్తం వసూలైంది. ఇందులో హిందీ వెర్షన్ సింహభాగం వాటాను దక్కించుకుంది. హిందీలో రూ. 78.94 కోట్లు వసూలు కాగా, 64.3 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తొలిరోజు రూ. 102.55 కోట్ల నెట్ వసూళ్లతో పోలిస్తే, రెండో రోజు సుమారు 21.3 శాతం తగ్గుదల కనిపించినప్పటికీ, సినిమా జోరు మాత్రం తగ్గలేదు. ఇప్పటివరకు ఈ చిత్రం దేశీయంగా రూ. 269.39 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.

విడుదలైన రెండు రోజుల్లోనే 'ధురంధ‌ర్ 2' అనేక రికార్డులను బద్దలు కొట్టింది. శుక్రవారం నాటికే రూ. 150 కోట్లు, రూ. 200 కోట్ల మార్కులను దాటేసింది. ఈ క్రమంలో 'సికందర్', 'ది రాజా సాబ్' చిత్రాల లైఫ్‌టైమ్ కలెక్షన్లను అధిగమించింది. అంతేగాక‌ 'ఫైటర్' చిత్రం సాధించిన రూ. 212 కోట్ల లైఫ్‌టైమ్ నెట్ వసూళ్లను కూడా దాటి, ప్రస్తుతం 'వార్' (రూ. 236 కోట్లు నెట్) రికార్డు దిశగా దూసుకెళ్తోంది.

గతేడాది (2025) విడుదలై పెద్ద హిట్‌గా నిలిచిన 'ధురంధ‌ర్' చిత్రానికి ఇది సీక్వెల్. ఈ నెల‌ 19న విడుదలైన ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషించగా, ఆర్. మాధవన్, రాకేశ్‌ బేడి, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఈ చిత్రం ఇవాళ‌ సులభంగా రూ. 250 కోట్ల నెట్ వసూళ్ల మార్కును దాటుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Go Back to Shorts
Dhurandhar 2
Ranveer Singh
Aditya Dhar
Box Office Collection
Bollywood Movie
R Madhavan
Arjun Rampal
Sanjay Dutt
Hindi Cinema
Movie Review

More Telugu News