పచ్చబొట్టుతో వీడిన హత్య మిస్టరీ.. ప్రియుడే హంతకుడు!

పచ్చబొట్టుతో వీడిన హత్య మిస్టరీ.. ప్రియుడే హంతకుడు!

Mystery solved in NTR district Ibrahimpatnam woman murder case
  • ప్రియుడు షఫీయే నిందితుడని తేల్చిన పోలీసులు
  • కుమారుడిని తిరిగివ్వాలన్న గొడవే హత్యకు కారణం
  • చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతురాలి గుర్తింపు
  • హత్య తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికిన నిందితుడు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర కలకలం రేపిన మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. మృతురాలిని కల్యాణి (29) అలియాస్ దుర్గగా గుర్తించారు. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భవానిపురం వాసి షఫీయే ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కుమారుడి విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘోరానికి దారితీసిందని తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. కల్యాణి, షఫీ కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. గతంలో కల్యాణి తన కుమారుడిని షఫీ సంరక్షణలో ఉంచింది. అయితే, ఇటీవల తన బిడ్డను తిరిగి ఇచ్చేయాలని ఆమె పదేపదే ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సహనం కోల్పోయిన షఫీ, సుమారు పది రోజుల క్రితం కల్యాణిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఇబ్రహీంపట్నం సమీపంలోని చన్నీలు కాలువలో పడేశాడు.

సెప్టెంబర్ 17న కాలువలో శరీర భాగాలు లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలిని గుర్తించడం సవాలుగా మారడంతో, ఆమె దుస్తులు, చేతిపై ఉన్న ప్రత్యేకమైన పచ్చబొట్టు ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ పచ్చబొట్టును చూసిన కల్యాణి సోదరుడు పోలీసులను సంప్రదించడంతో కేసులో పురోగతి లభించింది. ఈ కేసుకు స్థానిక మీడియా కూడా సహకరించిందని ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.

మృతురాలు కల్యాణి చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో గన్నవరం సమీపంలోని ఓ అనాథాశ్రమంలో పెరిగింది. మంగళగిరికి చెందిన వ్యక్తితో వివాహం జరిగి, విభేదాల కారణంగా విడిపోయింది. అక్కడే ఓ హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో హత్య మంగళగిరిలోనే జరిగి ఉండవచ్చని, అనంతరం నిందితుడు మృతదేహం భాగాలను ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి పడేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు షఫిని అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.
Advertisement
Kalyani
Ibrahimpatnam Murder Case
Shafi
NTR District Police
Andhra Pradesh Crime News
Channilu Canal

More Telugu News