Supreme Court: అప్పు తిరిగివ్వాలని అడగడం ఆత్మహత్యకు ప్రేరేపణ కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court Asking for Loan Repayment Not Suicide Abetment
షార్ట్స్‌లో చూడండి
అప్పు తిరిగి చెల్లించాలని అడగడం లేదా ఒత్తిడి చేయడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. కేవలం రుణం తిరిగివ్వాలని డిమాండ్ చేయడాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తిపై నమోదైన ఆత్మహత్య ప్రేరేపణ కేసును కొట్టివేసింది. ఈ కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చుతూ జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు ఇచ్చింది.

కేసు నేపథ్యం ఏమిటంటే.. 
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఒక వ్యక్తి ట్రాక్టర్ ట్రాలీ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పలువురు అప్పుల వాళ్లు వేధిస్తున్నారని ఆరోపిస్తూ అతను రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. ఆ నోట్‌లో తొమ్మిది మంది రుణదాతల పేర్లను పేర్కొన్నాడు. వారిలో ఒకరైన ధీరూభాయ్ నంజీభాయ్ పటేల్ లోత్వాలాపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపణ), 506(2) (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. మృతుడికి ఆరు నెలల వ్యవధిలో నిందితుడు సుమారు 40 సార్లు ఫోన్ చేసినట్లు కాల్ రికార్డులను ప్రాసిక్యూషన్ ఆధారాలుగా చూపింది. తనపై కేసును కొట్టివేయాలని ధీరూభాయ్ మొదట గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఊరట లభించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.

సుప్రీంకోర్టు ఏమంది? 
ఈ కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం, ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు ఆత్మహత్య ప్రేరేపణను నిరూపించడానికి సరిపోవని అభిప్రాయపడింది. "సూసైడ్ నోట్‌లో తొమ్మిది మంది పేర్లు ఉన్నప్పటికీ, ఎవరి పాత్ర ఏమిటో స్పష్టంగా లేదు. బెదిరింపుల స్వభావం, అవి ఎప్పుడు, ఎక్కడ జరిగాయనే వివరాలు లేవు. అందరు రుణదాతలను ఒకే గాటన కట్టారు. ఇలాంటి సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ జరపడం వృధా ప్రయాస అవుతుంది" అని ధర్మాసనం పేర్కొంది.

అప్పు తిరిగివ్వమని రుణదాత ఫోన్ చేయడం చట్టబద్ధమైన చర్యేనని, కేవలం ఎక్కువసార్లు ఫోన్ చేసినంత మాత్రాన దానిని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. మృతుడిపై శారీరక దాడి లేదా బలవంతం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు గమనించింది. ఈ పరిస్థితుల్లో నిందితుడిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ధీరూభాయ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్, తదుపరి చర్యలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
Go Back to Shorts
Supreme Court
Loan recovery
Suicide abetment
Gujarat High Court
Justices Manoj Mishra
Justice Manmohan
Debt recovery
Morbi district
IPC Section 306
Suicide note

More Telugu News