Guggilla Satyanarayana: చనిపోయాడన్నారు.. అంబులెన్స్‌లో కళ్లు తెరిచాడు!

Congress Leader Guggilla Satyanarayana Revives After Being Declared Dead
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లో సినిమాను తలపించే ఓ అద్భుత ఘటన చోటుచేసుకుంది. వైద్యులు చనిపోయాడని ధ్రువీకరించిన ఓ వ్యక్తి అంత్యక్రియలకు తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే కళ్లు తెరిచాడు. ఈ అనూహ్య పరిణామంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు గుగ్గిళ్ల సత్యనారాయణ (46) హైదరాబాద్‌లోని రహమత్‌నగర్‌లో పూలవ్యాపారం చేస్తుంటారు. వారానికోసారి స్వగ్రామం వెళ్లి వస్తుంటారు. సోమవారం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా బుధవారం సాయంత్రం ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ వార్తతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. ఇంటి వద్ద టెంట్లు వేసి, మృతదేహం కోసం ఫ్రీజర్ బాక్సును కూడా సిద్ధం చేశారు.

మృతదేహాన్ని అంబులెన్స్‌లో కొల్లాపూర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో బంధువులు, మిత్రులు కడసారి చూపు కోసం ఆగారు. ఆ సమయంలో సత్యనారాయణ ఒక్కసారిగా కళ్లు తెరవడమే కాకుండా, చేతులు కదిలించారు. పిలవగానే స్పందించడంతో తొలుత భయపడినా, ఆయన బతికే ఉన్నారని తెలిసి ఆనందంలో మునిగిపోయారు. వెంటనే ఆయనను మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.

బతికున్న వ్యక్తిని చనిపోయాడని ప్రకటించిన ప్రైవేటు ఆసుపత్రి నిర్లక్ష్యంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం తెలియగానే కొల్లాపూర్‌లో అంత్యక్రియల ఏర్పాట్లను నిలిపివేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Go Back to Shorts
Guggilla Satyanarayana
Hyderabad
Congress Leader
Declared Dead
Miraculous Recovery
Private Hospital Negligence
Yashoda Hospital
Kollapur
Telangana News
False Death

More Telugu News