Sourav Ganguly: అది విధిరాత.. ఒక అద్భుతం: ఈడెన్ టెస్టు విజయంపై గంగూలీ

Sourav Ganguly Reflects on Historic Eden Gardens Test Victory
షార్ట్స్‌లో చూడండి
భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఒక అద్భుత అధ్యాయంగా నిలిచిపోయిన 2001 ఈడెన్ గార్డెన్స్ టెస్టు జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి హీరోలు తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, వెంకటేశ్ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొనగా, అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ వర్చువల్‌గా చేరాడు.

ఈ విజయంపై గంగూలీ మాట్లాడుతూ.. "అది విధిరాత. ఒక అద్భుతమైన కథలాంటిది. ఆ విజయం కోసం నా దగ్గర ప్రత్యేకమైన వ్యూహమేమీ లేదు. అది నేను చేసింది కాదు. దానంతట అదే జరిగిపోయింది" అని వ్యాఖ్యానించాడు.

ఆ మ్యాచ్ హీరో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. "నా తల్లిదండ్రుల వల్ల నేను ఈ ప్రపంచంలోకి వచ్చాను. కానీ, ఈడెన్ గార్డెన్స్ లేకపోతే నేను ఏమయ్యేవాడినో నాకు తెలియదు" అని భావోద్వేగానికి గురయ్యాడు. అనిల్ కుంబ్లే గాయపడటంతో తనకు అవకాశం వచ్చిందని, వికెట్లు తీయగల బౌలర్ కావాలని కోచ్ జాన్ రైట్ భావించగా, గంగూలీ పట్టుబట్టి తనను జట్టులోకి తీసుకున్నాడని భజ్జీ గుర్తుచేసుకున్నాడు.

ఆ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట గురించి జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. "ఆ రోజు ఒక్క వికెట్ కూడా కోల్పోకూడదని మేనేజర్ చేతన్ చౌహాన్ మాతో అన్నారు. లక్ష్మణ్, ద్రవిడ్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. ఓటమి అంచున ఉన్న జట్టును ఓడిపోలేని స్థితికి తీసుకొచ్చారు" అని తెలిపాడు. ఐదో రోజు రాహుల్ ద్రవిడ్, శివ సుందర్ దాస్, రమేశ్ పట్టిన క్యాచ్‌లు విజయంలో కీలకపాత్ర పోషించాయని భజ్జీ అన్నాడు.

ఇక, వెంకటేశ్ ప్రసాద్ తాను క్యాచ్ వదిలేసిన క్షణాలను గుర్తుచేసుకుంటూ.. "ప్రేక్షకుల అరుపుల వల్ల క్యాచ్ మిస్ చేశాను. టీ విరామ సమయంలో నాకు నరకం కనిపించింది. పదేపదే టీవీలో అదే చూపించడంతో చాలా బాధపడ్డాను" అని తెలిపాడు. కెప్టెన్‌గా గంగూలీ ఎంతో గొప్పవాడని, తాను ఆడిన కెప్టెన్లలో ఉత్తముడని హర్భజన్ ప్రశంసించాడు. గంగూలీ అందరికీ అందుబాటులో ఉండేవాడని జహీర్ ఖాన్ అన్నాడు.
Go Back to Shorts
Sourav Ganguly
Eden Gardens Test
India vs Australia
Harbhajan Singh
Venkatesh Prasad
Zaheer Khan
Rahul Dravid
2001 Test Series
Cricket History
Indian Cricket

More Telugu News