నేటి రాజకీయాలపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

Venkaiah Naidu Key Comments on Current Politics
  • రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరుగుతోందన్న వెంకయ్యనాయుడు 
  • క్యారెక్టర్, క్యాలిబర్ ఉన్న నాయకులనే ఎన్నుకోవాలని సూచన
  • ప్రాథమిక విద్య మాతృభాషలోనే సాగాలని స్పష్టీకరణ
రాజకీయాల్లో డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని, దీనివల్ల నాణ్యత, బాధ్యత కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు క్యారెక్టర్ (ప్రవర్తన), క్యాలిబర్ (సామర్థ్యం), కెపాసిటీ (పనితీరు), కాండక్ట్ (నడవడిక) అనే నాలుగు అంశాలను తప్పనిసరిగా చూడాలని ఆయన సూచించారు. 

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా విజయవాడ కానూరులోని సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీలో నిన్న 'వినియోగదారుల అవగాహన, సాధికారత' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. నేటి రాజకీయాల్లో కులం, మతం, ప్రాంతీయత వంటి అంశాలకు ప్రాధాన్యం పెరిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు. 

రాజకీయం, విద్య, వైద్యం అనేవి వ్యాపారం కాదని, అవి ప్రజలకు సేవ చేసే మిషన్లు అని స్పష్టం చేశారు. కానీ నేడు విద్య, వైద్య రంగాలు పూర్తిగా వ్యాపారమయంగా మారిపోవడం బాధాకరమన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని, మాతృభాష కళ్లు లాంటిదైతే, ఆంగ్లం కళ్లజోడు వంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. కళ్లు లేకుండా కళ్లజోడు వల్ల ఉపయోగం లేదని గుర్తుచేశారు. 

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ చీమలపాటి రవి, సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు ఎం. రాజయ్య, సిద్ధార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ దివాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Venkaiah Naidu
Politics
Indian Politics
Corruption in Politics
Consumer Rights
Education System
Mother Tongue
Vijayawada
Siddhartha University
Political Ethics

More Telugu News