ఉప్పల్‌లో దారుణం: ఏఆర్ కానిస్టేబుల్‌ను పొడిచి చంపిన స్నేహితుడు

Sudheer AR Constable Murdered by Friend in Uppal
  • స్నేహితుల మధ్య వాట్సాప్‌లో గొడవ
  • కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో కానిస్టేబుల్ మృతి
  • నిందితుడు సంతోష్ నాయక్ కోసం పోలీసుల గాలింపు
హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని అతడి స్నేహితుడే కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. వాట్సప్‌లో మొదలైన చిన్న గొడవ ఈ దారుణానికి దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం రాత్రి ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకానగర్‌లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన సుధీర్ (35), హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు చిలుకానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ సంతోష్ నాయక్‌తో స్నేహం ఉంది. శనివారం రాత్రి వీరిద్దరి మధ్య వాట్సప్‌లో మాటామాటా పెరిగింది. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఆదివారం రాత్రి చిలుకానగర్‌లోని ఆదర్శనగర్‌లో కలుసుకున్నారు. సుధీర్ తన స్నేహితుడు ఇమ్రాన్‌తో కలిసి వెళ్లగా, అప్పటికే అక్కడ వేచి ఉన్న సంతోష్ కత్తితో సుధీర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు.

ప్రాణభయంతో సుధీర్ పరుగులు తీసినా, ఉప్పల్-చిలుకానగర్ మార్గంలోని సాయిబాబా ఆలయం వద్ద కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు సంతోష్ నాయక్, అతడి సహచరుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మృతుడు సుధీర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
Go Back to Shorts
Sudheer
Uppal
Hyderabad
AR Constable
Murder
Chilkanagar
Santosh Nayak
Crime
WhatsApp Fight

More Telugu News