BCCI: బీసీసీఐ ప్రైజ్ మనీ రూ. 131 కోట్లను ఎలా పంపిణీ చేస్తారంటే?

BCCI How 131 Crore Prize Money Will Be Distributed
  • ప్రతి ఆటగాడికి రూ. 6 కోట్ల చొప్పున నగదు బహుమతి
  • కోచింగ్ స్టాఫ్, సెలెక్టర్లకు కూడా భారీగా వాటా
  • సపోర్ట్ స్టాఫ్‌కు హోదాను బట్టి నగదు పంపిణీ
  • 2024 కంటే ఈసారి రూ. 6 కోట్లు అదనంగా కేటాయింపు
టీ20 ప్రపంచకప్ 2026లో చారిత్రాత్మక విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కాసుల వర్షం కురిపించింది. వరుసగా రెండోసారి కప్పు గెలిచి చరిత్ర సృష్టించినందుకు గాను మొత్తం రూ. 131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ భారీ మొత్తాన్ని జట్టు సభ్యులు, కోచ్‌లు, ఇతర సిబ్బందికి ఏ విధంగా పంపిణీ చేయనున్నారనే దానిపై ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రపంచకప్ ఆడిన 15 మంది సభ్యుల జట్టులోని ప్రతి ఆటగాడికి రూ. 6 కోట్ల చొప్పున అందనుంది. అంటే కేవలం ఆటగాళ్లకే సుమారు రూ. 90 కోట్లు అందుతాయి. 2024 ప్రపంచకప్ గెలిచినప్పుడు ప్రతి ఆటగాడికి రూ. 5 కోట్లు ఇవ్వగా, ఈసారి ఆ మొత్తాన్ని మరో కోటి రూపాయలు పెంచడం గమనార్హం.

మిగిలిన రూ. 41 కోట్లను కోచింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్, సెలెక్టర్లకు పంపిణీ చేయనున్నారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లకు సమానంగా లేదా వారి సీనియారిటీని బట్టి భారీ మొత్తమే దక్కనుంది. ఇతర సపోర్ట్ స్టాఫ్ (ఫిజియోలు, మసాజర్లు, థెరపిస్టులు) కి వారి హోదా, అనుభవం ఆధారంగా వాటాను నిర్ణయించనున్నారు.

బీసీసీఐ ఇచ్చే ఈ రూ. 131 కోట్లు కాకుండా, ఐసీసీ (ICC) నుంచి కూడా భారత జట్టుకు సుమారు రూ. 21.5 కోట్ల (USD 2.34 మిలియన్) విజేత నగదు బహుమతి లభించింది. దీంతో టీమిండియా ఆటగాళ్ల ఖాతాల్లోకి భారీగా నగదు వచ్చి చేరనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు ఇది తగిన గుర్తింపు అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు.
BCCI
BCCI prize money
Indian cricket team
T20 World Cup 2026
Gautam Gambhir
Devajit Saikia
ICC
Cricket prize money
Team India

More Telugu News