Air India: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. విడతల వారీగా పెరగనున్న విమాన ఛార్జీలు

Air India to Increase Flight Charges Due to ATF Price Hike
  • విమాన ఛార్జీలపై ఫ్యూయల్ సర్ ఛార్జ్ పెంచనున్నట్లు తెలిపిన ఎయిర్ ఇండియా
  • మధ్యప్రాచ్యంలో యుద్ధంతో పెరిగిన ఏటీఎఫ్ ధరలే ఈ పెంపునకు కారణం
  • అంతర్జాతీయ సర్వీసులపై 10 నుంచి 90 డాలర్ల వరకు అదనపు భారం
  • ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలకు ప్రస్తుతానికి మినహాయింపు
  • భారత్‌కు సహజ వాయువు సరఫరాపైనా యుద్ధ ప్రభావం
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులపై అదనపు భారం మోపనుంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడంతో తమ దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఫ్యూయల్ సర్ ఛార్జ్‌ను విడతల వారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకోవడం విచారకరమని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ భారాన్ని మోపాల్సి వస్తోందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం వాటా ఉండే జెట్ ఫ్యూయల్ ధరలు 2026 మార్చి ప్రారంభం నుంచి గణనీయంగా పెరిగాయని ఎయిర్ ఇండియా వెల్ల‌డించింది. సర్ ఛార్జ్ పెంచకపోతే కొన్ని విమాన సర్వీసులు ఆర్థికంగా నిలదొక్కుకోలేవని, వాటిని రద్దు చేయాల్సి రావొచ్చని పేర్కొంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త సర్ ఛార్జీలను మూడు దశల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించింది. మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే విమానాలపై 10 డాలర్లు, ఆఫ్రికాకు 30 నుంచి 90 డాలర్లు, ఆగ్నేయాసియా దేశాలకు 20 నుంచి 60 డాలర్ల వరకు సర్ ఛార్జ్ పెరగనుంది. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు ఈ ఛార్జీలను సమీక్షిస్తామని సంస్థ తెలిపింది.

అయితే, టాటా గ్రూప్‌కు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు ప్రస్తుతానికి ఈ సర్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వడం ప్రయాణికులకు కొంత ఊరట కలిగించే విషయం.

సహజ వాయువు సరఫరాపైనా ప్రభావం
ఇరాన్-యూఎస్ యుద్ధం కేవలం విమాన ఇంధనంపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సహజ వాయువు సరఫరాపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. హోర్ముజ్ జలసంధి గత రెండు వారాలుగా యుద్ధ క్షేత్రంగా మారడంతో దాదాపు 750కి పైగా కార్గో నౌకలు ఆ ప్రాంతంలోని ప్రధాన పోర్టులలో నిలిచిపోయాయి. ఖతార్‌లోని గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఎగుమతి సంస్థ అయిన ఖతార్ ఎనర్జీ ఉత్పత్తిని నిలిపివేసింది.

భారత్ తన సహజ వాయువు అవసరాల్లో 50 శాతం దిగుమతులపై ఆధారపడగా అందులో 20 శాతం ఖతార్ నుంచే వస్తోంది. తాజా పరిణామాలతో సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ సవాలును ఎదుర్కొనేందుకు దేశంలోని వివిధ రంగాలకు సహజ వాయువు సరఫరా, వినియోగాన్ని నియంత్రించేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కీలక రంగాలను నాలుగు ప్రాధాన్యత వర్గాలుగా విభజించి సరఫరాను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టింది.
Air India
Aviation Turbine Fuel
ATF price hike
Fuel Surcharge
Iran US war
Qatar Energy
Natural Gas supply
Air India Express
Middle East
Jet fuel prices

More Telugu News