అత్యాధునిక AI మోడళ్లకు యాక్సెస్‌ బంద్‌.. ఆంథ్రోపిక్‌ సంచలన నిర్ణయం!

Anthropic sensational decision to stop access to advanced AI models
  • అమెరికా ఆదేశాలతో సేవలు నిలిపివేత
  • ఫేబుల్‌ 5, మిథోస్‌ 5 యాక్సెస్‌ బంద్‌
  • జాతీయ భద్రత కారణమంటున్న అమెరికా
  • నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆంథ్రోపిక్‌
అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఏఐ రంగంలో సంచలనంగా మారింది. ప్రముఖ కృత్రిమ మేధస్సు సంస్థ ఆంథ్రోపిక్‌ తన అత్యాధునిక ఏఐ మోడళ్లైన క్లాడ్‌ ఫేబుల్‌ 5, మిథోస్‌ 5 సేవలను ప్రపంచవ్యాప్తంగా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఎగుమతి నియంత్రణ ఆదేశాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

విదేశీ పౌరులకు ఫేబుల్‌ 5, మిథోస్‌ 5 మోడళ్ల యాక్సెస్‌ను నిలిపివేయాలని అమెరికా ప్రభుత్వం ఆదేశించినట్లు ఆంథ్రోపిక్‌ తెలిపింది. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి వివరాలు తమకు ఇవ్వలేదని పేర్కొంది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందనే అనుమానంతోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

ప్రత్యేకంగా ఫేబుల్‌ 5 మోడల్‌లో భద్రతా వ్యవస్థలను సైతం బ్రేక్‌ చేసే సామర్థ్యం ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దీన్ని ఉపయోగించి సాఫ్ట్‌వేర్ లోపాలను గుర్తించడం లేదా సైబర్‌ దాడులకు సహకరించే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలను కంపెనీ అంగీకరించడం లేదు. పరిమిత స్థాయిలో ఉన్న ఓ లోపాన్ని కారణంగా చూపి ప్రపంచవ్యాప్తంగా సేవలను నిలిపివేయడం సరైన చర్య కాదని కంపెనీ అభిప్రాయపడింది. ఇదే విధానాన్ని మొత్తం ఏఐ పరిశ్రమపై అమలు చేస్తే కొత్త మోడళ్ల అభివృద్ధి, విడుదల తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించింది.

ఇటీవలే ఆంథ్రోపిక్‌ తన కొత్త తరం ఏఐ మోడల్‌గా ఫేబుల్‌ 5ను విడుదల చేసింది. దీనికి మిథోస్‌ క్లాస్ సామర్థ్యాలు ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. సైబర్‌ సెక్యూరిటీ వంటి సున్నిత రంగాల్లో దుర్వినియోగం జరగకుండా ఇప్పటికే పలు భద్రతా పరిమితులు కూడా అమలు చేసింది.
 
అయితే ఆంథ్రోపిక్‌, అమెరికా ప్రభుత్వం మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఆ దేశ సైన్యం కోసం దేశీయ నిఘా వ్యవస్థలు, పూర్తిస్థాయి ఆటోమేటెడ్‌ ఆయుధాల అభివృద్ధిలో తమ ఏఐ మోడళ్లను వినియోగించేందుకు కంపెనీ నిరాకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆంథ్రోపిక్‌ వెల్లడించింది.
Go Back to Shorts
Anthropic
Claude Fable 5
Mythos 5
US Export Controls
Artificial Intelligence Models
National Security Risks

More Telugu News