Ahmed Shehzad: మనం కెన్యా, ఉగాండాలపైనే నెగ్గుతున్నాం.. భారత్ గెలుపు వేళ పాక్ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ahmed Shehzad Comments on India Win Spark Controversy
  • భారత్ విజయంతో పాక్ క్రికెట్ వర్గాల్లో కలకలం
  • సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లపై ప్రశంసల జల్లు
  • పాక్ టీమ్‌ను జింబాబ్వే, ఉగాండాతో పోల్చిన షెజాద్
  • పాకిస్థాన్‌కు విడిగా ర్యాంకింగ్స్ ఇవ్వాలంటూ ఎద్దేవా
అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భారత్ టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన తీరుపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు అహ్మద్ షెజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ టీవీ షో 'హర్నా మనా హై'లో పాల్గొన్న ఆయన.. భారత క్రికెట్ వ్యవస్థను చూసి తమ దేశం నేర్చుకోవాల్సింది చాలా ఉందని హితవు పలికాడు. ముఖ్యంగా టీమిండియా బ్యాటర్లు 250 పరుగులు చేయడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

భారత జట్టులో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజూ శాంసన్, అలాగే ఇషాన్ కిషన్‌ల గురించి షెజాద్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. "పాక్ లో ప్రతిభకు కొదవ లేదు. బోలెడంత ఉంది. ఎటొచ్చీ ఇక్కడ క్రికెట్ వ్యవస్థలోనే లోపాలున్నాయి. అదే భారత్‌ విషయానికి వస్తే, టాలెంట్‌తో పాటు అక్కడి క్రికెట్ లో బలమైన వ్యవస్థ ఉంది. అందుకే ఎప్పుడో ఒకసారి అవకాశం వచ్చే సంజూ శాంసన్ లాంటి వారు కూడా వరల్డ్ కప్‌లో హీరోలు అవుతున్నారు. క్రమశిక్షణ విషయంలో ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టినా, మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించి జట్టులోకి వచ్చి అదరగొట్టాడు. ఇది కదా సిస్టమ్ అంటే!" అని ఆయన కొనియాడాడు.

భారత్ ఈ మ్యాచ్‌లో 255 పరుగులు చేయడంపై స్పందిస్తూ.. "ఒకవేళ మన జట్టు ఆడి ఉంటే 180 పరుగులు చేసి, దాన్ని డిఫెండ్ చేయమని బౌలర్లకు చెప్పి చేతులు దులుపుకునేవాళ్ళం. న్యూజిలాండ్ ఫామ్ లోకి వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇండియా 275 పరుగుల దిశగా వెళ్ళేది. ఫైనల్ ఒత్తిడిలో యువ ఆటగాడు అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేసి తనేంటో నిరూపించుకున్నాడు" అని షెజాద్ విశ్లేషించాడు.

పాకిస్థాన్ జట్టు తీరుపై షెజాద్ తీవ్రమైన సెటైర్లు వేశారు. "మనం జింబాబ్వే, ఉగాండా, కెన్యా లాంటి జట్లను పిలిచి, వారిపై గెలిచి సంబరాలు చేసుకుంటాం. భారత్ మాత్రం పెద్ద జట్లతో, పెద్ద సిరీస్‌లు ఆడుతూ గెలుస్తోంది. ఐసీసీకి నాదొక విన్నపం.. పాకిస్థాన్‌ను భారత్, ఆస్ట్రేలియా లాంటి జట్లతో పోల్చకండి. మాకు విడిగా ఒక ర్యాంకింగ్ ఇవ్వండి, అందులో కేవలం కెన్యా, ఉగాండా, జింబాబ్వే జట్లు మాత్రమే ఉండాలి" అంటూ ఘాటుగా విమర్శించాడు.
Ahmed Shehzad
Pakistan cricket
T20 World Cup 2026
India vs New Zealand
Shoaib Akhtar
Cricket controversies
Cricket analysis
Cricket news
Sports news
Pakistan cricketers

More Telugu News