New Zealand Cricket Team: టీ20 వరల్డ్ కప్: భారత బౌలర్ల దెబ్బకు కివీస్ టాపార్డర్ కుదేల్

New Zealand Top Order Collapses Against Indian Bowlers in T20 World Cup
  • అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్
  • భారీ లక్ష్య ఛేదనలో విఫలమైన న్యూజిలాండ్ టాపార్డర్
  • 87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కివీస్
  • ఒంటరి పోరాటం చేసిన టిమ్ సీఫెర్ట్.. మిగతా వారు విఫలం
  • తొలుత బ్యాటింగ్ చేసి 255 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరులో న్యూజిలాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. టీమిండియా నిర్దేశించిన 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. భారత బౌలర్ల ధాటికి కకావికలమైంది. ముఖ్యంగా ఆ జట్టు టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది.

ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ ఫిన్ అలెన్ (9)ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చగా, స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (1)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. గ్లెన్ ఫిలిప్స్ (5), మార్క్ చాప్‌మన్ (3) కూడా పూర్తిగా నిరాశపరిచారు. వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్ మాత్రం భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి కేవలం 26 బంతుల్లోనే 5 సిక్సర్లతో 52 పరుగులు చేసి అర్ధశతకం సాధించాడు. అయితే వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో సీఫెర్ట్ కూడా అవుట్ కావడంతో న్యూజిలాండ్ కోలుకోలేకపోయింది. ప్రస్తుతం 9.4 ఓవర్లలో 87 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. క్రీజులో డారిల్ మిచెల్, సాంట్నర్ ఉన్నారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ కీపర్ సంజు శాంసన్ (89), అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) కివీస్ బౌలర్లను ఉతికారేశారు. చివర్లో శివమ్ దూబే (8 బంతుల్లో 26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.  ప్రస్తుతం న్యూజిలాండ్ విజయానికి ఇంకా 62 బంతుల్లో 169 పరుగులు చేయాల్సి ఉండటంతో టీమిండియా వరల్డ్ కప్ గెలవడం లాంఛనంగా కనిపిస్తోంది.
New Zealand Cricket Team
T20 World Cup
India vs New Zealand
Sanju Samson
Ishan Kishan
Abhishek Sharma
Shivam Dube
Indian Bowlers
Narendra Modi Stadium
Axar Patel

More Telugu News