Mojtaba Khamenei: ఇరాన్ పగ్గాలు చేపట్టిన ఖమేనీ కుమారుడు ముజ్తబా

Mojtaba Khamenei Appointed Supreme Leader
  • ఇరాన్ కొత్త అత్యున్నత నేతగా ముజ్తబా ఖమేనీ
  • తండ్రి మరణం తర్వాత కుమారుడికి అధికార పగ్గాలు
  • సైన్యం ఒత్తిడితోనే నియామకం జరిగిందన్న వార్తలు
  • ఇరాన్‌లో వారసత్వ రాజకీయాలపై తీవ్ర విమర్శలు
పశ్చిమాసియా రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నేతగా (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీ నియమితులైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో అలీ ఖమేనీ మరణించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్‌ను మత పెద్దల సభ 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) తీవ్ర ఒత్తిడి మేరకే 56 ఏళ్ల ముజ్తబాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 'ఇరాన్ ఇంటర్నేషనల్' తన కథనంలో పేర్కొంది. సైన్యంతో ముజ్తబాకు ఉన్న సన్నిహిత సంబంధాలే ఆయన నియామకానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాచరిక పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌లో.. తండ్రి నుంచి కుమారుడికి అధికారం బదిలీ కావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో వారసత్వ రాజకీయాలు మొదలయ్యాయంటూ దేశీయంగా, అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత 27 ఏళ్లుగా తెరవెనుక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ముజ్తబా, ఇప్పుడు నేరుగా అధికార పగ్గాలు చేపట్టడం గమనార్హం.

ముజ్తబా ఖమేనీ ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆయనకు IRGCలో మంచి పట్టు ఉంది. అమెరికా 2019లో ఈ సైనిక విభాగాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సైన్యం మద్దతుతో ముజ్తబా అధికార పీఠం ఎక్కడం పశ్చిమాసియాలో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Mojtaba Khamenei
Iran
Supreme Leader
Ali Khamenei
Islamic Revolutionary Guard Corps
IRGC
Iran politics
Middle East
Iran Iraq war
Assembly of Experts

More Telugu News