Afghanistan: పాకిస్థాన్ కీలక సైనిక స్థావరాలపై ఆప్ఘనిస్థాన్ వైమానిక దాడులు

Afghanistan Air Strikes on Pakistan Military Bases
  • ఆపరేషన్ సిందూర్ సమయంలో ధ్వంసమైన నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై కూడా ఆప్ఘన్ దాడి
  • క్వెట్టా, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడి
  • పాక్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలిపిన తాలిబన్
పాకిస్థాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై తమ వైమానిక దళం దాడులు నిర్వహించిందని ఆప్ఘనిస్థాన్ రక్షణ శాఖ ప్రకటించింది. భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టినప్పుడు రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం ధ్వంసమైంది. దీనిని పాకిస్థాన్ రిపేర్ చేసుకుంటోంది. ఇప్పుడు ఆప్ఘనిస్థాన్ ఆ విమానాశ్రయాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య గత కొన్నిరోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో పాక్ కీలక సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ఆప్ఘనిస్థాన్ వెల్లడించింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో పాటు క్వెట్టాలోని 12వ కార్ప్స్ ప్రధాన కార్యాలయం, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పలు కీలకమైన పాక్ సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. తమ దేశంలోని వివిధ ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు నిర్వహించిందని ఆందోళన వ్యక్తం చేసింది.

పాకిస్థాన్ సైనిక చొరబాట్లకు ప్రతీకారంగా ఈ దాడులు నిర్వహించినట్లు ఆప్ఘనిస్థాన్ రక్షణ శాఖ ప్రకటించింది. తాము చేసిన దాడిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో పాటు పలు సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయని తెలిపింది. మరోవైపు, ఆప్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌లో పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తాలిబన్లు తెలిపారు. విమాన పైలట్ తమ అదుపులో ఉన్నట్లు వెల్లడించింది.
Afghanistan
Pakistan
Afghanistan Pakistan Conflict
Noor Khan Air Base
Quetta 12th Corps Headquarters

More Telugu News