Ali Khamenei: హైదరాబాద్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ పేరిట రోడ్డు.. ఖమేనీ మృతితో వెలుగులోకి ఆసక్తికర చరిత్ర!

Ali Khamenei Road in Hyderabad sparks interest after death
  • ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతితో చర్చనీయాంశమైన హైదరాబాద్‌లోని ఓ రోడ్డు
  • బంజారాహిల్స్‌లోని ఈ రోడ్డుకు మొదటి సుప్రీం లీడర్ రుహోల్లా ఖొమైనీ పేరు 
  • కుతుబ్ షాహీల కాలం నుంచి ఇరాన్‌తో ఉన్న సంబంధాలకు గుర్తుగా ఈ నామకరణం
  • ఇదే రోడ్డులో వున్న ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం 
  • రుహోల్లా ఖొమైనీ పూర్వీకులు ఉత్తర ప్రదేశ్‌కు చెందినవారు కావడం విశేషం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ సంఘటన నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భాగ్యనగరంలో ఇరాన్ అధినేత ఖమేనీ పేరుతో ఒక రోడ్డు ఉందన్న వార్త చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే, ఆ రోడ్డుకు ప్రస్తుతం మరణించిన అలీ ఖమేనీ పేరు పెట్టలేదని, దాని వెనుక బలమైన చారిత్రక కారణాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7నే అధికారికంగా 'ఇమామ్ ఖమేనీ రోడ్' అని పిలుస్తారు. జీవీకే మాల్ ఎదురుగా ఉన్న ఈ రహదారిలోనే ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం కూడా ఉంది. అయితే, ఈ పేరు ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు, మొదటి సుప్రీం లీడర్ అయిన గ్రాండ్ అయతొల్లా రుహోల్లా ముసావీ ఖొమైనీ జ్ఞాపకార్థం పెట్టారు. ఆయన మరణానంతరం అలీ ఖమేనీ ఇరాన్‌కు రెండవ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

చారిత్రక బంధానికి గుర్తుగా..
హైదరాబాద్‌కు, ఇరాన్‌కు మధ్య కుతుబ్ షాహీల కాలం నుంచే బలమైన చారిత్రక, సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఆ దౌత్యపరమైన బంధానికి గౌరవ సూచకంగా, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (MCH) ఉన్నప్పుడు ఈ రహదారికి ఇమామ్ రుహోల్లా ఖొమినీ పేరును పెట్టారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన తొలి దౌత్య కార్యాలయాల్లో ఇరాన్ కాన్సులేట్ ఒకటి కావడం ఈ సంబంధాల లోతును తెలియజేస్తుంది.

అంతేకాకుండా ఈ రహదారికి పేరు పెట్టడానికి కారణమైన ఇమామ్ రుహోల్లా ఖొమైనీకి భారత మూలాలు ఉండటం మరో ఆసక్తికరమైన అంశం. ఆయన తాత సయ్యద్ అహ్మద్ ముసావి 19వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా కింతూరు గ్రామంలో జన్మించారు. ఆయన భారత్ నుంచి ఇరాన్‌కు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కాలక్రమంలో ఆయన వారసులు ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన మత, రాజకీయ నేతలుగా ఎదిగారు. ప్రస్తుతం అలీ ఖమేనీ మరణంతో దశాబ్దాల నాటి ఈ చారిత్రక విషయం మరోసారి వార్తల్లో నిలిచింది.
Ali Khamenei
Hyderabad
Iran
Imam Khomeini Road
Banjara Hills
Iran Consulate Hyderabad
India Iran relations
Qutb Shahi dynasty
Ruhollah Khomeini
Syed Ahmad Musavi

More Telugu News