వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనుల్లో వేగం.. ఏడాదిలో సేవలు ప్రారంభం
- ఏడాదిలో అందుబాటులోకి రానున్న వరంగల్ మామునూరు విమానాశ్రయం
- కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో డీపీఆర్.. త్వరలో ఆమోదం పొందే అవకాశం
- 3 కిలోమీటర్ల మేర రన్‌వే విస్తరణ.. ఆధునిక టెర్మినల్, కార్గో సౌకర్యాల నిర్మాణం
- విమానాశ్రయానికి భూసేకరణ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచే లక్ష్యంతో మరో మూడు విమానాశ్రయాల ప్రతిపాదన
కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభించి, ఏడాదిలో పూర్తి చేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రణాళికలు రచిస్తోంది. ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థల పెద్ద విమానాలు కూడా సులభంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రన్‌వేను 3 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. దీంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్యాసింజర్ టెర్మినల్, కార్గో సదుపాయం, పటిష్ఠమైన భద్రతా వ్యవస్థలు, విశాలమైన పార్కింగ్ వంటివి నిర్మించనున్నారు. ఈ విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సుమారు 950 ఎకరాల భూమిని కేటాయించగా, అదనంగా మరో 253 ఎకరాలను సేకరించి ఏఏఐకి అప్పగించింది.
ప్రస్తుతం తెలంగాణలో పౌర విమానయాన సేవలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మాత్రమే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీని పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మామునూరుతో పాటు రామగుండం, పెద్దపల్లి, కొత్తగూడెంలలో కూడా విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. మామునూరు ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే వరంగల్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
విమాన సేవలు ప్రారంభమైతే పారిశ్రామిక, ఐటీ సంస్థలు ఈ ప్రాంతానికి తరలివచ్చేందుకు ఆసక్తి చూపుతాయి. అదేవిధంగా రామప్ప ఆలయం, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట వంటి చారిత్రక ప్రదేశాలకు దేశ, విదేశీ పర్యాటకుల రాక కూడా గణనీయంగా పెరుగుతుంది. తొలినాళ్లలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాలకు చిన్న, మధ్యస్థాయి విమానాలతో సర్వీసులు నడిపే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఓరుగల్లు ప్రాంతం ఆర్థికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందడం ఖాయమని భావిస్తున్నారు.