ఫేస్‌బుక్ స్నేహం.. గోల్డ్ ట్రేడింగ్ పేరుతో వృద్ధుడికి రూ. 2.65 కోట్ల టోకరా వేసిన మహిళ!
- గోల్డ్ ట్రేడింగ్ పేరుతో లాభాల ఆశ చూపి వల
- దశలవారీగా రూ. 2.65 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
- నకిలీ వెబ్‌సైట్‌తో నమ్మించి మోసం
- సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
కొన్నాళ్లపాటు స్నేహంగా మాట్లాడి బాధితుడి నమ్మకాన్ని సంపాదించుకున్న ఆ మహిళ తాను గోల్డ్ ట్రేడింగ్ ద్వారా కోట్లు సంపాదించానని నమ్మబలికింది. తనకు కేరళ, హైదరాబాద్‌లలో రిసార్టులు, వస్త్ర వ్యాపారాలు ఉన్నాయని చెప్పి ఆకట్టుకుంది. రూ. 50 లక్షలు పెట్టుబడి పెడితే కోట్లలో లాభాలు వస్తాయని ఆశ చూపడంతో వృద్ధుడు ఆమె వలలో చిక్కాడు.
మొదట చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టించగా, నమ్మకం కుదిరేలా మంచి లాభాలు అందించింది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో దశలవారీగా పెట్టుబడులు పెట్టించింది. లాభాలు కోట్లలో ఉన్నాయంటూ ఓ నకిలీ వెబ్‌సైట్‌ను చూపించి నమ్మించింది. అయితే, ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే 15 శాతం కమీషన్ చెల్లించాలని సందేశం రావడంతో బాధితుడికి అనుమానం వచ్చింది.
దీంతో అతడు ఆ మహిళకు ఫోన్ చేయగా, అది స్విచాఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.