చిక్కుల్లో యూట్యూబర్ రమా నందన ఫ్యామిలీ!

Case Filed Against Popular YouTuber Nandus Family Over Alleged UK Visa Renewal Fraud
  • ప్రముఖ యూట్యూబర్ నందు కుటుంబంపై చీటింగ్ కేసు నమోదు
  •  యూకే వీసా రెన్యూవల్ పేరుతో రూ. 15 లక్షలు మోసం చేశారని ఆరోపణ
  •  బాధితుడి ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్
  •  డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులో వెల్లడి
ప్రముఖ యూట్యూబర్, 'నందు'స్ వరల్డ్' ఫేమ్ రామా నందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, ఆయన తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. యూకే వీసా రెన్యూవల్ పేరుతో రూ.15 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలైంది.
 
పోలీసుల వివరాల ప్రకారం, మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. తన యూకే వీసా గడువు ముగియనుండటంతో, రెన్యూవల్ కోసం ఆయన 'డెస్టినీ కన్సల్టెన్సీ'ని నడుపుతున్న నందు కుటుంబాన్ని సంప్రదించారు. వీసా ప్రక్రియను సులభంగా పూర్తి చేస్తామని నమ్మించి, వారు రూ. 15 లక్షలు తీసుకున్నారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, నెలలు గడుస్తున్నా వీసా పని పూర్తి చేయలేదని, డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని తెలిపారు.
 
బాధితుడి ఫిర్యాదు మేరకు చీటింగ్, నమ్మకద్రోహం సెక్షన్ల కింద (క్రైమ్ నం. 515/2025) కేసు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం ఎస్ఐ బి. రాజు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. యూట్యూబ్‌లో నందుకు ఉన్న పాపులారిటీని చూసి నమ్మి డబ్బులు ఇచ్చానని బాధితుడు చెబుతున్నాడు.
 
ఈ వ్యవహారం సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీసింది. ఇదే విధంగా యూకే ఉద్యోగాలు, వీసాల పేరుతో రూ.15 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు వసూలు చేశారని మరికొందరు ఆరోపిస్తున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలను నందు కుటుంబం ఖండిస్తున్నట్లు సమాచారం. తమపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వారు అంటున్నట్లు తెలుస్తోంది.
 
ఒకప్పటి నటి అయిన రామా నందన, తన కుటుంబంతో కలిసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫ్యామిలీ వ్లాగ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పాపులారిటీతో వారికి సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. తాజా ఆరోపణలతో ఈ యూట్యూబ్ జంట వివాదంలో చిక్కుకుంది. ఈ కేసుపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Advertisement
YouTube
Nandu’s World
Visa Fraud
UK
India
NTR Dist
Ibrahimpatnam

More Telugu News