పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై యువతి కత్తితోదాడి
- కర్ణాటకలోని రామనగర జిల్లాలో జరిగిన ఘటన
- జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న యువకుడి పరిస్థితి విషమం
- నిందితురాలు సుధను అదుపులోకి తీసుకున్న పోలీసులు
పోలీసుల వివరాల ప్రకారం నిందితురాలిని 30 ఏళ్ల సుధగా, బాధితుడిని 27 ఏళ్ల వేణుగోపాల్‌గా గుర్తించారు. వేణుగోపాల్ బిడదిలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తుండగా, సుధ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. జిమ్‌లో పరిచయమైన వీరిద్దరూ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు.
అయితే, గత నాలుగు నెలలుగా వేణుగోపాల్ సుధను దూరం పెడుతూ వస్తున్నాడు. పెళ్లి ప్రతిపాదనను కూడా నిరాకరించాడు. ఈ క్రమంలో వేణుగోపాల్ మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని తెలుసుకున్న సుధ, కోపంతో దాడికి పథకం రచించింది. వారం రోజులుగా తన బ్యాగులో కత్తి పెట్టుకుని తిరుగుతున్న సుధ గురువారం రాత్రి వేణుగోపాల్‌కు ఫోన్ చేసి ఇంటి నుంచి బయటకు పిలిచింది. అతను బయటకు రాగానే ఒక్కసారిగా కత్తితో పొడిచింది.
ఛాతీ, పొట్ట, చేతులపై తీవ్ర గాయాలపాలైన వేణుగోపాల్, అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతను తన ఫోన్‌తో తల్లిదండ్రులకు, స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి ఆసుపత్రికి తరలించారు. బిడది పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితురాలు సుధను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.