DK Shivakumar: బెంగళూరు హోటల్‌లో 30 మంది ఎమ్మెల్యేలు.. సీఎం మార్పుపై డీకేఎస్ ఒత్తిడి?

DK Shivakumar Pressing for CM Change 30 MLAs Meet in Bangalore Hotel
  • బెంగళూరు హోటల్‌లో డీకే శివకుమార్ వర్గం రహస్య భేటీ
  • సుమారు 30 మంది ఎమ్మెల్యేలతో బలప్రదర్శనకు యత్నం
  • సీఎం మార్పు ఒప్పందంపైనే ప్రధానంగా చర్చ
  • సిద్ధరామయ్య వర్గం ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనలో
  • అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అన్న మల్లికార్జున ఖర్గే
కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గానికి చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో రహస్యంగా సమావేశం కావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుక అని పైకి చెబుతున్నప్పటికీ అధికార మార్పిడిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండున్నరేళ్ల తర్వాత పదవిని తనకు అప్పగిస్తారనే ఒప్పందం ఉందని డీకే శివకుమార్ వర్గం బలంగా వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన బలాన్ని నిరూపించుకునేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే, ఐదేళ్లూ సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని ఆయన వర్గం స్పష్టం చేస్తోంది. ఈ సమావేశంలో ఇద్దరు మంత్రులు కూడా పాల్గొనడం గమనార్హం.

డీకే శివకుమార్ వర్గం ఇక్కడ సమావేశమైన సమయంలోనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మద్దతుగా ఉన్న 20 మందికి పైగా ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనలో ఉన్నారు. వారు మార్చి 1న తిరిగి రానున్నారు. మరోవైపు, ఈ పరిణామాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ నాయకత్వ మార్పుపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని, ప్రస్తుతానికి ఎలాంటి గందరగోళం లేదని తెలిపారు.

ఇదిలా ఉండగా, సిద్ధరామయ్య మద్దతుదారులు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చాల్సి వస్తే, దళిత నేతకు (మల్లికార్జున ఖర్గే లేదా జి. పరమేశ్వర) అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత మార్చిలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
DK Shivakumar
Karnataka Congress
Siddaramaiah
Karnataka Politics
Congress Leaders
Leadership Change
Mallikarjun Kharge
G Parameshwara
Karnataka Government
MLAs Meeting

More Telugu News