Mokshagna: ‘ఆదిత్య 999 మ్యాక్స్’... క్రిష్ దర్శకత్వంలో బాలయ్య వారసుడి ఎంట్రీ?
- వెండితెరపై మళ్లీ 'ఆదిత్య 369' మ్యాజిక్
- టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కనున్న మూవీ
- నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధం?
టాలీవుడ్‌లో గత దశాబ్ద కాలంగా వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న.. 'నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు?'. ఆ నిరీక్షణకు తెరదించుతూ, నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ తన సినీ ప్రస్థానాన్ని ఒక సంచలన ప్రాజెక్టుతో ప్రారంభించబోతున్నాడనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కేవలం ఒక మామూలు కమర్షియల్ సినిమాతో కాకుండా... లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు సృష్టించిన 'ఆదిత్య 369' మ్యాజిక్‌ను మళ్ళీ వెండితెరపై ఆవిష్కరిస్తూ, 'ఆదిత్య 999 మ్యాక్స్' అనే భారీ ఫ్రాంచైజీలోకి మోక్షజ్ఞ అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చేపట్టబోతున్నట్లు సమాచారం. గతంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి చారిత్రాత్మక చిత్రంతో బాలయ్యకు మైలురాయి లాంటి విజయాన్ని అందించిన క్రిష్, ఇప్పుడు మోక్షజ్ఞను ఎలా ప్రెజెంట్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. సైన్స్ ఫిక్షన్ కథాంశానికి మాస్ ఎలిమెంట్స్‌ను జోడించి, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందించేందుకు పక్కా ప్లాన్ సిద్ధమైనట్లు టాక్. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే ఈ కథలో విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని సమాచారం.
భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో బాలయ్య స్వయంగా ఈ కథపై ఆసక్తి చూపించినప్పటికీ, ఇప్పుడు తన వారసుడిని ఈ ప్రాజెక్టు ద్వారా లాంచ్ చేయడం బెటర్ అని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సిన అవసరం ఉంది.