Revanth Reddy: నీటి హక్కులపై రాజీ ప్రసక్తే లేదు: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy No compromise on Telangana water rights
  • తెలంగాణ ప్రయోజనాలపై రాజీపడేది లేదన్న సీఎం రేవంత్
  • నీటి సమస్యలపై అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్‌కు సూచన
  • కాళేశ్వరం ప్రాజెక్టును వృథాగా పోనివ్వమని స్పష్టం
  • రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ
  • దేవాదుల భూసేకరణకు రూ. 600 కోట్లు కేటాయిస్తామని ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు నదీ జలాలను మళ్లించేందుకు తాను మద్దతిస్తున్నానంటూ చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర నీటి హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు.

ఆదివారం ములుగు జిల్లాలో దేవాదుల ప్రాజెక్టుపై జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. నీటి సమస్యలపై చౌకబారు ఆరోపణలు చేస్తూ ప్రజలకు సంబంధించిన అంశాలను రాజకీయం చేయవద్దని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. అవసరమైతే తాము పొరుగు రాష్ట్రాలతో చర్చిస్తామని, కానీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో వెనకడుగు వేయబోమని అన్నారు. గోదావరి జలాల అంశంపై బడ్జెట్ సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేసీఆర్, హరీశ్ రావు తమ విలువైన సలహాలు ఇవ్వాలని సూచించారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ వివాదాలు ఉండేవి కావని సీఎం చురకలంటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేసి, ఇతర ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. "కాళేశ్వరం వారి సొంత ఆస్తి కాదు. అది ప్రజల డబ్బు. దాన్ని వృథాగా పోనివ్వం. తిరిగి వినియోగంలోకి తెస్తాం" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

నిధుల కొరత ఉన్నప్పటికీ, రెండేళ్లలో రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. దేవాదుల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 6,000 కోట్ల నుంచి రూ. 18,500 కోట్లకు పెరిగిందన్నారు. భూసేకరణ కోసం జూన్ 2 లోగా రూ. 600 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. అన్ని ప్రాజెక్టుల భూసేకరణకు ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి, గ్రీన్ ఛానల్ ద్వారా పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Revanth Reddy
Telangana water rights
KCR allegations
Harish Rao criticism
Devadula project
Godavari River
Kaleshwaram project
Telangana projects
Irrigation projects

More Telugu News