పగలు బ్యూటీ పార్లర్, రాత్రి డ్రగ్స్ దందా... పోలీసులకు పట్టుబడిన లేడీ డాన్ 'మేడమ్ జహర్'

Khusnuma Ansari aka Madam Zeher Arrested in Delhi Drug Ring
షార్ట్స్‌లో చూడండి
దేశ రాజధాని దిల్లీలో మరో 'లేడీ డాన్' గుట్టురట్టయింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సంబంధాలున్న ఖుస్నుమా అన్సారీ అలియాస్ నేహాను పోలీసులు అరెస్టు చేశారు. పగలు బ్యూటీ పార్లర్ నడుపుతూ, రాత్రిపూట డ్రగ్స్ సిండికేట్‌ను శాసిస్తున్న ఈమెను గ్యాంగ్‌స్టర్లు 'మేడమ్ జహర్' (అందమైన విషం) అని పిలుచుకుంటారు.

ఇటీవల మహిపాల్‌పూర్ ఫ్లైఓవర్ వద్ద భారీగా డ్రగ్స్ పట్టుబడిన కేసు దర్యాప్తులో పోలీసులకు 'మేడమ్ జహర్' పేరు పదేపదే వినిపించింది. దీనిపై లోతుగా విచారణ జరపగా... ఈశాన్య దిల్లీలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న ఖుస్నుమానే ఆ లేడీ డాన్ అని తేలింది. బ్యూటీ పార్లర్‌ను అడ్డం పెట్టుకుని ఆమె ఈ అక్రమ వ్యాపారాన్ని ఏళ్లుగా కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఖుస్నుమాకు లారెన్స్ బిష్ణోయ్, హషీమ్ బాబా ముఠాలకు ఆయుధాలు సరఫరా చేసే బాబీ కబూతర్ అలియాస్ మహ్‌ఫూజ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పాకిస్థాన్ ఐఎస్‌ఐతో సంబంధమున్న ఆయుధాల డీలర్ సలీమ్ పిస్టల్ నుంచి బాబీ ఆయుధాలు సేకరిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య, నటి దిశా పటానీ ఇంటిపై కాల్పుల ఘటనల్లో బాబీ సరఫరా చేసిన ఆయుధాలనే వాడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

పక్కా సమాచారంతో దిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ విభాగం ఖుస్నుమా, బాబీ కబూతర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసింది. ఈ ముఠా ఆర్థిక మూలాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన లేడీ డాన్‌లు దీప, జోయా ఖాన్‌లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Khusnuma Ansari
Madam Zeher
Lawrence Bishnoi
Delhi Police
Drugs syndicate
Beauty parlor
Arms supply
Hashim Baba
Bobby Kabootar
Salim Pistol

More Telugu News