'రణబాలి'ని ప్రతి భారతీయుడు చూడాల‌ని అన్నామలై పిలువు.. ఆయ‌న‌ ప్రామిసింగ్ లీడర్ అంటూ విజయ్ దేవరకొండ కితాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రణబాలి'ని ప్రతి భారతీయుడు చూడాల‌ని అన్నామలై పిలువు.. ఆయ‌న‌ ప్రామిసింగ్ లీడర్ అంటూ విజయ్ దేవరకొండ కితాబు

Vijay Deverakonda and Annamalai discuss untold history in Ranabali special conversation
  • ‘రణబాలి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రత్యేక ఇంటర్వ్యూ
  • రాజకీయ నేత అన్నామలైపై విజయ్ దేవరకొండ ప్రశంసల వర్షం
  • చరిత్రలో దాచిపెట్టిన నిజాలను ఈ సినిమా చూపిస్తుందన్న అన్నామలై
  • ప్రతి భారతీయుడు ‘రణబాలి’ చూడాలని ఆయన పిలుపు
  • అన్నామలై ఒక ప్రామిసింగ్ లీడర్ అంటూ విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం వినూత్నంగా ముందుకెళ్తోంది. 

ఇందులో భాగంగా మాజీ ఐపీఎస్‌ అధికారి, ప్రముఖ రాజకీయ నాయకుడు అన్నామలై, న్యాయవాది జె.సాయి దీపక్‌లతో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘రణబాలి హిస్టారిక్ కన్వర్జేషన్’ పేరుతో జరిగిన ఈ చర్చలో విజయ్ దేవరకొండ.. అన్నామలైపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

1854-1878 మధ్య కాలంలో బ్రిటిష్ ఇండియాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సంభవించిన ఘోర కరవు, ఆ సమయంలో బ్రిటిషర్ల దాష్టీకాలను కళ్లకు కట్టేలా చూపించబోతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. 

ఈ నేపథ్యంలో జరిగిన చర్చలో అన్నామలై మాట్లాడుతూ.. పాఠ్యపుస్తకాల్లో చెప్పని ఎన్నో చారిత్రక వాస్తవాలను ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. బ్రిటిషర్లు తమ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని చరిత్రలోని ఎన్నో నిజాలను తొక్కిపెట్టారని, వాటిని వెలికితీస్తున్న ‘రణబాలి’ చిత్రాన్ని ప్రతి భారతీయుడు తప్పక చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ అన్నామలైపై ప్రశంసలు కురిపించారు. "తమిళనాడుకు చెందిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై అన్నను ‘రియల్ సింగం’ అంటారు. నేను ఆయన ఇంటర్వ్యూలు చూశాను. చాలా ఇంటెలిజెంట్, షార్ప్‌గా ఎంతో నాలెడ్జ్‌తో మాట్లాడతారు. మన దేశంలో ఆయన లాంటి బాగా మాట్లాడే రాజకీయ నాయకులను చూడటం నాకు ఎంతో ఉత్తమమైన అనుభూతినిస్తుంది. 

ఒక యువకుడిగా ఇది నాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆయన ఒక ప్రామిసింగ్ లీడర్. రాజకీయాల్లో ఆయన ప్రభావం ఎలా ఉంటుందో చూడటానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని విజయ్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఒక స్టార్ హీరో, ప్రముఖ రాజకీయ నేతపై ఇలా బహిరంగంగా ప్రశంసలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Vijay Deverakonda
Ranabali movie
Annamalai
J Sai Deepak
Rahul Sankrityan
British India history

More Telugu News