1.5 గంటల కిక్‌బాక్సింగ్‌.. ఐదేళ్ల తర్వాత పునీత్‌ చివరి క్షణాలపై వైద్యుడి కీలక విషయాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

1.5 గంటల కిక్‌బాక్సింగ్‌.. ఐదేళ్ల తర్వాత పునీత్‌ చివరి క్షణాలపై వైద్యుడి కీలక విషయాలు!

Puneeth Rajkumar last moments and 15 hours kickboxing doctor reveals key details
  • మరణానికి ముందు తొలిసారి కిక్‌బాక్సింగ్‌ చేసిన పునీత్‌
  • జిమ్‌లో సుమారు గంటన్నర పాటు వ్యాయామం చేసినట్లు డాక్టర్‌ వెల్లడి
  • తీవ్ర అలసటతో పాటు విపరీతంగా చెమటలు పట్టినట్లు చెప్పిన డాక్టర్‌
  • ఈసీజీలో గుండెపై ఒత్తిడి ఉన్నట్లు గుర్తించామన్న డాక్టర్‌ రమణారావు
  • ఆస్పత్రికి చేరడానికి నిమిషం ముందు గుండె కొట్టుకోవడం ఆగినట్లు వెల్లడి
కన్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణించి ఐదేళ్లు కావస్తున్న వేళ.. ఆయన చివరి క్షణాల్లో ఏం జరిగిందో గుర్తుచేసుకున్నారు వ్యక్తిగత వైద్యుడు డాక్టర్‌ రమణారావు. మరణానికి ముందు పునీత్‌ కిక్‌బాక్సింగ్‌ చేసి తీవ్రంగా అలసిపోయారని వెల్లడించారు. తన క్లినిక్‌కు వచ్చినప్పుడు విపరీతంగా చెమటలు పడుతున్నాయని తెలిపారు. ఈసీజీ పరీక్షలో గుండెపై ఒత్తిడి ఉన్నట్లు కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశానని వెల్లడించారు. 

పునీత్‌ను అభిమానులు ప్రేమగా ‘అప్పు’ అని పిలుచుకుంటారు. 2021 అక్టోబర్‌ 29న, 46 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశాడు. బెంగళూరులోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించినా వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు.

‘జస్ట్‌ క్యూరియస్‌ కన్నడ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్‌ రమణారావు పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అతను తనకు కొడుకుతో సమానమని, తన రెండో కుమారుడితో పునీత్‌ చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండేవాడని చెప్పారు.

ఘటన జరిగిన రోజు జిమ్‌లో సుమారు గంటన్నర పాటు కిక్‌బాక్సింగ్‌ చేసిన పునీత్‌ తన క్లినిక్‌కు వచ్చారని రమణారావు తెలిపారు. ఆ రోజు తొలిసారిగా ఆ వ్యాయామం చేయడంతో ఆయన బాగా అలసిపోయారని చెప్పారు. విపరీతంగా చెమటలు పడుతుండటంతో వెంటనే ఈసీజీ పరీక్ష చేయగా గుండెపై ఒత్తిడి ఉన్నట్లు గుర్తించానన్నారు.

“అది గుండెపోటు కాదు.. గుండెపై ఒత్తిడి ఉన్నట్లు పరీక్షలో కనిపించింది. వెంటనే మందులు ఇచ్చి ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశా” అని వివరించారు. పునీత్‌ తన కారులోనే ఆస్పత్రికి బయల్దేరారని, అప్పటికీ మాట్లాడుతున్నాడని చెప్పారు. కారులో నిటారుగా కూర్చోవాలని ఆయన ప్రయత్నించగా, భార్య అశ్విని ఒడిలో తల పెట్టుకుని విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. డాక్టర్‌ రంగనాయక్‌ ఆస్పత్రిలో అవసరమైన ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు.

ఆస్పత్రికి చేరుకోవడానికి ఒక్క నిమిషం ముందు పునీత్‌ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని రమణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయనను బతికించలేకపోయారని చెప్పారు. పునీత్‌ మరణం తన జీవితంలో అత్యంత బాధాకరమైన ఘటనల్లో ఒకటని, సొంత కొడుకును కోల్పోయినట్లుగా అనిపించిందని అన్నారు.
Advertisement
Puneeth Rajkumar
Dr Ramana Rao
Puneeth Rajkumar last moments
Kickboxing exhaustion
Kannada actor Appu
Vikram Hospital Bangalore

More Telugu News