Kulavardhan: అన్నమయ్య జిల్లాలో చిన్నారిపై హత్యాచారం... చెరువులో శవమై తేలిన నిందితుడు

Annamayya district Minor Girl Rape and Murder Case Culprit Kulavardhan Dead
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని, ఆ తర్వాత చెరువులో శవమై తేలాడు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన కులవర్ధన్ (30) కురబలకోట మండలం కనసానిపల్లి చెరువులో మరణించి కనిపించడం తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని మంగళవారం పోలీస్ వాహనంలో తరలిస్తుండగా తప్పించుకున్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైందని జిల్లా ఎస్పీ కె. ధీరజ్ మీడియాకు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది ఆత్మహత్యగా భావిస్తున్నామని, నిందితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని తెలిపారు.

వివరాల్లోకి వెళితే, మదనపల్లె పట్టణానికి చెందిన చేనేత కార్మికుడి ఏడేళ్ల కుమార్తె సోమవారం అదృశ్యమైంది. రెండో తరగతి చదువుతున్న ఆ చిన్నారి, పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి దగ్గర ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. పనుల నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు, కుమార్తె కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు, బాధితురాలి పొరుగింట్లో ఉండే కులవర్ధన్‌కు నేరచరిత్ర ఉండటంతో అతనిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు అతని ఇంటికి వెళ్లగా లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో, కిటికీలోంచి చూడగా నిద్రపోతూ కనిపించాడు.

అయితే, బాలిక చివరిసారిగా కులవర్ధన్‌తోనే కనిపించిందని మృతురాలి తాత చెప్పడంతో పోలీసులు మరుసటి రోజు ఉదయం ఇంట్లోకి ప్రవేశించి చూడగా, నీళ్ల డ్రమ్ములో బాలిక మృతదేహం లభ్యమైంది. వెంటనే కులవర్ధన్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో తప్పించుకు పారిపోయాడు.

ఈ దారుణ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు జాతీయ రహదారిపై బైఠాయించి గంటల తరబడి రాస్తారోకో నిర్వహించారు. డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ, పోస్టుమార్టం నివేదిక ప్రకారం నిందితుడు బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత నీటి డ్రమ్ములో ముంచి అత్యంత కిరాతకంగా హత్య చేశాడని వెల్లడించారు. 

నిందితుడిపై గతంలో సెక్షన్ 324 కింద కేసు నమోదైందని, అది లోక్ అదాలత్‌లో రాజీ అయినట్లు పోలీసులు తెలిపారు. అతను తరచూ మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిందితుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Go Back to Shorts
Kulavardhan
Annamayya district
Andhra Pradesh
minor girl murder
rape case
police custody escape
Kurabalakota
crime news
Madanapalle
sexual assault

More Telugu News