Telangana Tiger: సిద్ధిపేట జిల్లాలో పెద్దపులి కలకలం... వరుసగా పశువులపై దాడులు!

Telangana Tiger Still at Large Attacks on Livestock Continue
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఓ పెద్దపులి సృష్టిస్తున్న భయాందోళనలు కొనసాగుతున్నాయి. వరుసగా పశువులపై దాడి చేస్తూ వాటిని చంపుతుండటంతో స్థానిక గ్రామాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు తమ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు.

తాజాగా కొహెడ మండలం ఆరెపల్లి గ్రామంలో పులి సంచరించినట్లు కొంతమంది రైతులు చెప్పడంతో గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. సమీపంలోని చంద్రానాయక్ తండా వద్ద మాలోత్ రమేష్ అనే రైతుకు చెందిన ఐదు దూడలను పులి చంపేసింది. స్థానికుల సమాచారంతో అటవీ, పోలీస్ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పులి పాదముద్రలను సేకరించారు. పులి సంచరిస్తున్న ప్రదేశాల్లో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. రైతులు తమ పశువులను పొలాల్లో కాకుండా ఇళ్ల వద్దే సురక్షితంగా కట్టేసుకోవాలని సూచించారు. అలాగే, పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఈ పులి గతంలో జిల్లాలోని ఘనపూర్, అక్కెనపల్లి, బస్వాపురం గ్రామాల్లోనూ పశువులపై దాడి చేసి చంపేసింది. శనివారం జనగామ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పశువులను చంపిన తర్వాతే ఇది సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించి ఉంటుందని అధికారులు తెలిపారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి ఈ పులి తెలంగాణలోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.

వారం రోజుల వ్యవధిలోనే తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండో ఘటన. ఫిబ్రవరి 6న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో సంచరించిన ఓ పులిని అటవీ అధికారులు విజయవంతంగా పట్టుకున్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
Telangana Tiger
Siddipet Tiger
Tiger Attack
Telangana Forest Department
Wildlife
Animal Attack
Chandranayak Thanda
Forest officials
Pashuvula Pai Dadulu
Big cat

More Telugu News