Donald Trump: అమెరికా 'మోస్ట్ డేంజరస్' లిస్టులో 89 మంది భారతీయులు

Donald Trump Lists 89 Indians in US Most Dangerous List
  • 'వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్' జాబితాను విడుదల చేసిన అమెరికా
  • 25 వేల మంది కరుడుగట్టిన నేరగాళ్లలో 89 మంది భారత సంతతి వ్యక్తులు
  • నేరగాళ్ల ఫోటోలు, వివరాలతో ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభం
అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా 'వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్' (డబ్ల్యూవోడబ్ల్యూ) పేరుతో కరుడుగట్టిన నేరగాళ్ల జాబితాను బహిర్గతం చేశారు. అమెరికా అంతర్గత భద్రతా విభాగం (డీహెచ్ఎస్) విడుదల చేసిన ఈ 25,000 మంది 'క్రిమినల్ ఏలియన్స్' డేటాబేస్‌లో 89 మంది భారత సంతతి వ్యక్తులు ఉండటం గమనార్హం. హత్యలు, లైంగిక దాడులు, డ్రగ్స్ స్మగ్లింగ్, భారీ ఆర్థిక మోసాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న వారిని ఈ జాబితాలో చేర్చారు.

అమెరికన్ల భద్రతకు ముప్పుగా మారిన ఈ 'రాక్షసులను' వీధుల నుంచి ఎలా తొలగిస్తున్నామో ప్రజలకు ప్రత్యక్షంగా చూపడానికే ఈ వెబ్‌సైట్‌ను (WOW.DHS.GOV) ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో నేరగాళ్ల పేర్లు, ఫోటోలు, వారు చేసిన నేరాలు, వారి జాతీయతను బహిరంగంగా ఉంచారు. భారతీయుల విషయానికొస్తే.. వీరిలో అత్యధికులు ఆర్థిక నేరాలు (వార్ ఫ్రాడ్, ట్యాక్స్ ఫ్రాడ్), హింసాత్మక దాడులు, లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

ఒకవైపు అక్రమ వలసదారులను సామూహికంగా బహిష్కరించే ప్రక్రియను ట్రంప్ వేగవంతం చేస్తుండగా, ఈ జాబితా విడుదల కావడం ప్రవాస భారతీయుల్లో కలకలం రేపుతోంది. అమెరికాలో ప్రస్తుతం సుమారు 7.25 లక్షల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు అంచనా. కాగా, ఈ బహిష్కరణ చర్యలపై డెమొక్రాట్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, దేశాన్ని నేరరహితంగా మార్చే వరకు ఈ 'క్లీన్-అప్' ప్రక్రియ ఆగేది లేదని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేస్తోంది.
Donald Trump
US Immigration
Illegal Immigrants
Criminal Aliens
Worst of the Worst
WOW DHS GOV
Indian Immigrants
US Security
Deportation
Crime

More Telugu News